మారకేష్ : మొరాకోలో శుక్రవారం రాత్రి వచ్చిన తీవ్ర భూకంపంలో మృతుల సంఖ్య ఆదివారం ఉదయం నాటికి 2012 కు చేరింది. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారు. ఓ ఫెంచివాసిని తాజాగా గుర్తించారు. మరో 1404 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం రాత్రి 11.11 గంటల సమయంలో సంభవించిన ఈ భూకంపం మారకేష్ దాని చుట్టుపక్కల 5 ప్రావిన్సులను భయకంపితులను చేసింది. హై అట్లాస్ పర్వతాల వద్ద ప్రాణనష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు.
Also Read: రూ. 360.40 కోట్లకు ముంబై గణేశుడి బీమా
మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటిస్తూ కింగ్ మహమ్మద్6 నిర్ణయం తీసుకున్నారు. బాధితులకు ఆహారం, పునరావాసం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వరుసగా రెండో రోజు కూడా ప్రజలు అర్ధరాత్రి వీధుల్లోనే గడిపారు. శిథిల భవనాల నుంచి వీలైనన్ని నిత్యావసరాలను ప్రజలు తమతోపాటు తెచ్చుకొన్నారు. మరోవైపు మారకేష్ ఎయిర్పోర్టు ప్రయాణికులతో నిండిపోయింది. దేశాన్ని వీడి వెళ్లే యాత్రికులు ఎక్కువగా ఉన్నారు. వారంతా నేలపైనే పడుకొన్నారు. విమాన ప్రయాణాల్లో ఎటువంటి మార్పులు లేవు. మరోవైపు ప్రజలకు సాయం చేసేందుకు మొరాకో సాకర్ జట్టు ముందుకొచ్చింది. ఈ జట్టు సభ్యులు క్షతగాత్రుల కోసం రక్తదానం చేశారు.