ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో అరెస్టైన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన సిఐడి అధికారులు కోర్టుకు రిమాండ్ రిపోర్టును సమర్పించారు. ఇందులో ఈ స్కామ్‌కి పాత్రధారి, సూత్రధారి అన్నీ చంద్రబాబే అని తెలిపింది. కనుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగిందని రిమాండ్ రిపోర్టులో సిఐడి తెలిపింది. నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని రిమాండ్ రిపోర్టులో తెలిపింది. ఆ రిపోర్ట్‌లో.. చంద్రబాబును సిఐడి ఎ37గా పేర్కొన్నారు. ఈ నేరంలో ఆయనే ముఖ్యమైన కుట్రదారని వివరించారు.
2021 డిసెంబరు 9 కంటే ముందు ఈ నేరం జరిగిందని వెల్లడించారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి సీమెన్స్ ప్రాజెక్టు కోసం 6 సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాలు, 36 టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. ఇందుకోసం.. రాష్ట్రప్రభుత్వ వాటాగా డిజైన్ టెక్ లిమిటెడ్‌కు రూ.371 కోట్లు విడుదల చేశారని ఎపి సిఐడి అధికారులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. చెల్లింపులు జరిగిన మొత్తానికి వస్తు సేవలను డిజైన్ టెక్ సంస్థ అందించలేదని సీఐడి పేర్కొంది. రూ.241 కోట్లకు సంబంధించిన లావాదేవీల్లో నకిలీ బిల్లులు ఉన్నట్టు మహారాష్ట్రలోని జిఎస్‌టి ఇంటెలిజెన్స్ గుర్తించినట్టు తెలిపింది. నకిలీ బిల్లులతో షెల్ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి.. హవాలా ద్వారా నిధులు కాజేశారని ఆరోపించింది.
అంతేకాకుండా, 2015-2019 వరకూ ముఖ్యమంత్రిగా పనిచేసిన డిజైన్ టెక్‌కు ప్రయోజనం కలిగించేలా వ్యవహరించారని సిఐడి రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈ కేసులో తుది లబ్దిదారు చంద్రబాబు అని వివరించింది. గతంలో చంద్రబాబు వ్యక్తిగత సహాయకుడు (పిఎ) పెండ్యాల శ్రీనివాస్, కిలారు రాజేష్ ద్వారా నిధులు స్వీకరించారని తెలిపింది. ఈ కేసులో ఎ1 సహా పలువురు నిందితులను అరెస్ట్ చేశామని సిఐడి రిపోర్ట్‌లో పేర్కొంది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి నిధులను షెల్ కంపెనీలకు మళ్లించారన్న సిఐడి, ఇదంతా చంద్రబాబుకి తెలిసే జరిగిందని 28 పేజీల రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. రిమాండ్ రిపోర్టులో సిఐడి చీఫ్ శనివారం చెప్పిన అంశాలనే ప్రధానంగా దర్యాప్తు అధికారి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు ఎసిబి కోర్టు (సిటీ సివిల్ కోర్టు)లో చంద్రబాబును సిఐడి అధికారులు హాజరుపరిచారు. ఎసిబి మూడో అదనపు న్యాయమూర్తి ముందు చంద్రబాబును హాజరుపరిచారు అధికారులు. జడ్జికి రిమాండ్ రిపోర్టును సమర్పించారు.