Monday, December 23, 2024

కమలం రేసులో మరొకరు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి టికెట్ వేటలో పులి మామిడి రాజు
నేడు బిజెపిలో చేరేందుకు రంగం సిద్ధం
మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో: సంగారెడ్డి బిజెపిలో ఇప్పటికే చాలా మంది నేతలు అసెంబ్లీ టికెట్ రేసులో ఉండగా, మరో నేత కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడమే లక్షంగా పార్టీలో చేరుతున్నారు. దీంతో కమలనాథుల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.సంగారెడ్డిలో ఒకప్పుడు బిజెపి బలమైన పార్టీగా ఉండేది. గతంలో ఇక్కడ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్, అనేక మంది కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులున్నారు. మెదక్ ఎంపి స్థానాన్ని కూడా ఆ పార్టీ గెలుచుకుంది. అయితే రాను రాను ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా ఆ పార్టీకి దక్క లేదు. ఇటీవల కాలంలో ప్రధాన మంత్రి మోదీ హవా కారణంగా, హిందూత్వ నినాదం కారణంగా తమ బలం బాగా పెరిగిందని ఆ పార్టీ అంచనా వేస్తున్నది. దీంతో అనేక మంది నేతలు పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఎంత ఖర్చుకైనా వెనుకాడేది లేదని కొందరు చెబుతుండగా, పార్టీ టికెట్ దక్కితే నిధులు ఆటోమేటిక్‌గా సమకూరుతాయని మరి కొందరు ఆశ పడుతున్నారు. వీరంతా ఇటీవల పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేశారు.

ఇంకా కొందరేమో దరఖాస్తు చేయకున్నప్పటికీ, టికెట్ వస్తుందన్న ధీమాతో ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ కొండాపూర్ ఎంపిపి రాజేశ్వర్‌రావు దేశ్ పాండే తో పాటు, జిల్లా పార్టీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, చంద్రశేఖర్, దయాకర్‌రెడ్డి, సంగారెడ్డి వైశ్య ప్రముఖుడు పురం సంతోష్ తదితరులు టికెట్ రేసులో ఉన్నారు. కొద్ది నెలల క్రితం పార్టీలో చేరిన సదాశివపేట నాయకుడు శివరాజ్ పాటిల్ కూడా టికెట్ రేసులో ఉన్నట్టు చెబుతున్నారు. ఎవరికి వారు తమ ప్రయత్నాల్లో ఉండగా, పార్టీ నేతలు , కార్యకర్తలు కూడా శిబిరాలుగా విడిపోయారు. దీంతో ఎక్కడ చూసినా టికెట్ వేటకు సంబంధించిన చర్చలే సాగుతున్నాయి. ఈ తరుణంలో సదాశివపేట బిఆర్‌ఎస్ కౌన్సిలర్, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు కూడారంగంలోకి దిగారు. ఆయన బిఆర్‌ఎస్ టికెట్ ఆశించగా, మాజీ ఎమ్మెల్యే, చేనేత కార్పోరేషన్ ఛైర్మన్ చింత ప్రభాకర్‌కు దక్కింది.

దీంతో కొద్ది రోజులుగా ఆయన తీవ్ర ఆసంతృప్తితో ఉన్నారు. లక్షలాదిగా ముదిరాజ్ సామాజిక వర్గం ఉన్నప్పటికీ..ఒక్కరికి కూడా బిఆర్‌ఎస్ టికెట్ ఇవ్వలేదని ఆరోపిస్తూ, రెండు రోజుల కిత్రం ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సోమవారం నాడు బిజెపిలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ద్వారా పార్టీలో చేరుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడమే లక్షంగా ఆయన పావులు కదుపుతున్నారు.ఈటెల రాజేందర్ ద్వారా ముందస్తుగా హామీ లభించినందు వల్లనే పులి మామిడి రాజు బిజెపి లో చేరుతున్నారన్న చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికే చాలా మంది ఉండగా, పోటీలో మరొకరు చేరారని కమలం పార్టీ కార్యకర్తలు అంటున్నారు. బలమైన సామాజిక వర్గంనకు చెందిన నేత కావడంతో ఆయన వల్ల తమకు పోటీ గట్టిగా ఉంటుందని ఇప్పటికే బిజెపిలో ఉన్న నేతలు భావిస్తున్నారు.

సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలు ఉన్నందున నగర ప్రాంత వాసులను ఆకట్టుకుంటే సంగారెడ్డిలో తిరిగి జెండా ఎగుర వేయవచ్చన్న అంచనాలో పార్టీ ఉన్నది. అయితే పార్టీలో చాలా మంది నేతలు ఎవరికి వారు అన్న రీతిలో వ్యవహరిస్తున్న కారణంగా అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ప్రతి గ్రామానికి పరిచయమైన గుర్తు అయినందున కష్టపడితే మంచి ఫలితం రాబట్టుకోవచ్చని పార్టీ ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికే పార్టీ ఉన్న నేతలు మాత్రం కొత్త వారి రాకను జీర్ణించుకోలేక పోతున్నారు.

తమ అవకాశాలకు గండికొడతారన్న ఆందోళనలో వారున్నారు. బిఆర్‌ఎస్ తమ అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించగా, కాంగ్రెస్ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరు దాదాపుగా ఖరారయినట్టే. ఢిల్లీకి ఆయన పేరొక్కటే వెళ్లినందున, ఆయన కంటే బలమైన నేత పార్టీలో లేనందున జగ్గారెడ్డిని కాదని, ఇంకొకరి పేరు వినపడే పరిస్థితే లేకుండా పోయింది.ఇక మిగిలింది బిజెపి అభ్యర్థిని ఖరారు చేయడమే..! పులి మామిడి రాజు రూపంలో పార్టీకి బలమైన నాయకుడు దొరికాడని కొందరు భావిస్తున్న నేపథ్యంలోనే ఆయన చేరిక ఖరారయినట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News