దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ, వాతావరణం, నీటి కాలుష్యం కాకుండా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్టించి పూజించాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో సోమవారం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో తయారు చేసిన మట్టి వినాయక ప్రతిమలను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం గణపతి పూజా విధానం గురించి దేవాదాయ శాఖ రూపొందించిన బుక్‌లెట్‌ను మంత్రి ఆవిష్కరించారు.
దేవాదాయ శాఖ రూపొందించిన బుక్‌లెట్‌ను ఆవిష్కరించిన మంత్రి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంగులు, రసాయనాలతో తయారు చేసిన వినాయక ప్రతిమలను నీటిలో నిమజ్జనం చేయడంతో జల కాలుష్యం ఏర్పడుతుందని, దీంతో పర్యావరణ పరిరక్షణకు ముప్పు వాటిల్లుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను తయారూ చేసి ఉచితంగా పంపిణీ చేస్తుందని ఆయన తెలిపారు. మట్టి వినాయక ప్రతిమల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, అదనపు కమిషనర్ కృష్ణవేణి, జాయింట్ కమిషనర్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.