Sunday, December 22, 2024

బకాయిలు చెల్లిస్తారా.. జైలుకెళ్తారా..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : క్రెడిట్ సూయిస్ కేసులో రూ.12.45 కోట్లు బకాయిలను డిపాజిట్ చేయాలని స్పైస్ జెట్ చైర్మన్ అజయ్ సింగ్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిలో రూ. 4.15 కోట్లు (5 లక్షల డాలర్లు) వాయిదా చెల్లింపు, రూ.8.29 కోట్ల డిఫాల్ట్ మొత్తం ఉంది. దీనికి గాను కోర్టు అజయ్ సింగ్‌కు సెప్టెంబర్ 22 వరకు గడువు ఇచ్చింది. ఈ సమయంలోగా చెల్లించకుంటే తీహార్ జైలుకు పంపుతామని కూడా కోర్టు హెచ్చరించింది.

సోమవారం నాడు జస్టిస్ విక్రమ్ నాథ్, అహ్సానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం 2015 నాటి ఈ క్రెడిట్ సూయిస్ కేసును విచారించింది. ‘తదుపరి చాలా కఠినమైన చర్యలు తీసుకోవలసి ఉంటుంది. స్పైస్‌జెట్ మూసివేసినా మేము పట్టించుకోము, కానీ అజయ్ సింగ్ నిబంధనలకు కట్టుబడి ఉండాలి’ అని కోర్టు పేర్కొంది. అంతేకాదు కోర్టులో జరిగే ప్రతి విచారణలోనూ హాజరు కావాలని అజయ్‌సింగ్‌ను ధర్మాసనం ఆదేశించింది.

స్పైస్‌జెట్, క్రెడిట్ సూయిస్ వివాదాన్ని పరిష్కరించేందుకు 2022 మేలో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అయితే షరతులను ఉద్దేశపూర్వకంగా పాటించడం లేదన్న ఆరోపణ ఉంది. ఈ కేసులో ఆగస్టు 14న అజయ్ సింగ్‌పై సుప్రీంకోర్టు ధిక్కార నోటీసును జారీ చేసింది. కోర్టు దాఖలు ప్రకారం, అజయ్ సింగ్ ఉద్దేశపూర్వకంగా షరతులను పాటించలేదు. అలాగే కోర్టు ఆదేశించినా రూ.199.25 కోట్ల బకాయిలను చెల్లించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News