మెడికల్ కాలేజీల్లో లోకల్ రిజర్వేషన్‌పై హైకోర్టు తీర్పు శుభపరిణామం
ట్విట్టర్‌లో మంత్రి హరీశ్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 2014 జూన్ 2 తర్వాత ఏర్పా టు చేసిన మెడికల్ కాలేజీల్లో కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం శుభపరిణామం అని వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తెలంగాణ విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడంతోపాటు, వాటి ద్వారా అందుబాటులోకి వచ్చిన ఎంబిబిఎస్ సీట్లు తెలంగాణ బిడ్డలకే దక్కేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని స్పష్టమైందన్నారు.
ఇప్పటికే సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఎంబిబిఎస్ బీ కేటగిరి సీట్లలో 85 శాతం సీట్లను స్థానిక విద్యార్థులకు రిజర్వ్ చేయడం ద్వారా తెలంగాణ విద్యార్థులకు అదనంగా 1,300 ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు తాజా తీర్పుతో మరో 520 మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు లభిస్తున్నాయి. ముందుచూపుతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ రెండు నిర్ణయాల వల్ల ఏటా 1,820 సీట్లు దక్కనున్నాయి. ఇది దాదాపు 20 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో సమానం.