Friday, January 10, 2025

జి20 ముగింపు

- Advertisement -
- Advertisement -

వంతుల వారీగా తనకు సంక్రమించిన జి 20 అధ్యక్ష పదవిని సద్వినియోగం చేయడానికి అమెరికా సహాయంతో ఇండియా వీలైనంత వరకు కృషి చేసింది. ఆదివారం నాడు న్యూఢిల్లీలో ముగిసిన జి20 శిఖరాగ్ర సమావేశాలు ఈ విషయాన్ని సందేహాతీతంగా నిరూపించాయి. చైనా, రష్యా అధినేతలు లేకుండా జరిగిన ఈ సమావేశాల ముగింపులో విడుదలైన ఢిల్లీ డిక్లరేషన్‌పై ఆ రెండు దేశాల ప్రభావం కనిపించింది. బాలిలో గత జి20 శిఖరాగ్రం సందర్భంగా విడుదలైన సంయుక్త ప్రకటనలో ఉక్రెయిన్ యుద్ధానికి రష్యాను బాధ్యురాలిని చేసి దానిని ఖండించారు.

ఉక్రెయిన్ నుంచి అది తప్పుకోవాలని ఆ డిక్లరేషన్ డిమాండ్ చేసింది. అందుకు భిన్నంగా ఢిల్లీ డిక్లరేషన్‌లో రష్యా ప్రస్తావన లేకుండా చేశారు. ఉక్రెయిన్ పడుతున్న బాధలను మాత్రమే ప్రస్తావించిన ఈ డిక్లరేషన్‌లో రష్యా మాట లేకుండా జాగ్రత్త పడ్డారు. ఏ ఒక్క దేశం ఇతర దేశ భూభాగాన్ని బల ప్రయోగం ద్వారా స్వాధీనం చేసుకోడానికి వీలులేదని ఇది స్పష్టం చేసింది. తనను ఎంత మాత్రం ఖండించరాదని రష్యా పట్టుబట్టింది. చైనా దానికి పూర్తిగా మద్దతు ఇచ్చింది. ఆ విధంగా వాటి అధినేతలు హాజరు కాకపోయినా ఆ రెండు దేశాలు తమ పంతాన్ని నెగ్గించుకొన్నాయి. ఏకాభిప్రాయంతో కూడిన సంయుక్త ప్రకటన రూపొందేలా చూడడంలో జి20 సారథ్య స్థానంలోని ఇండియా విజయం సాధించింది.

అమెరికా, యూరప్ కూడా ఇందుకు సహకరించాయి. దీనిని ప్రధాని మోడీ గొప్పతనంగా కీలకమైన ఎన్నికలకు ముందు బిజెపి చాటుకొంటుంది. ఉక్రెయిన్ యుద్ధానికి చర్చల ద్వారా పరిష్కారం కనుగొనేలా చేయడంలో ఈ పరిణామం దోహదం చేస్తుందేమో వేచి చూడాలి. జి20 లో 55 దేశాల ఆఫ్రియన్ యూనియన్‌కు శాశ్వత స్థానం కల్పించడం న్యూఢిల్లీ శిఖరాగ్ర సమావేశాల్లో సాధ్యమైన మరో మంచి పరిణామం. ఇంత వరకు కేవలం దక్షిణాఫ్రికాకు మాత్రమే ఈ బృందంలో సభ్యత్వం వున్నది. యూరోపియన్ యూనియన్ మాదిరిగా ఆఫ్రికన్ యూనియన్‌కు కూడా చోటు కల్పించడం ద్వారా జి20 గ్రూపు తన విస్తృతిని పెంచుకొన్నది.

ఇటీవల దక్షిణాఫ్రికా రాజధాని జోహెన్నస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల్లో సౌదీ అరేబియా, ఇరాన్ సహా ఆరు దేశాల (అర్జెంటినా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) ను ఆ కూటమిలో కొత్తగా చేర్చుకొన్న సంగతి తెలిసిందే. జి20 కి ప్రత్యామ్నాయంగా బ్రిక్స్‌ను తయారు చేయడం కోసం చైనా ప్రయత్నిస్తున్నదని ఈ చర్య రుజువు చేసింది. అందుకు ప్రతిగా అమెరికా కూడా ఇప్పుడు జి20లో ఆఫ్రికన్ యూనియన్‌ను చేర్చుకొనేలా చేసింది. ఇండియా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియా, యూరపులను రైలు, ఓడ రేవులతో అనుసంధానం చేయడానికి ఉద్దేశించిన పథకాన్ని అమెరికా, ఇండియా, సౌదీ అరేబియా తదితర జి20 దేశాలు ఢిల్లీ శిఖరాగ్ర సమావేశాల్లో ప్రకటించాయి.

పరిశీలించి చూస్తే ఇది చైనా అమలు పరుస్తున్న బెల్ట్ అండ్ రోడ్ (సిల్క్ రోడ్) ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా అనిపించడం సహజం. ఒకే బెల్ట్ ఒకే రోడ్ పేరిట చైనా తలపెట్టిన ఈ ప్రాజెక్టులో 150 దేశాలను కలుపుకొని పోవాలని ఉద్దేశించారు. దీనిని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ విదేశీ విధానంలో భాగంగా పరిగణిస్తున్నారు. ప్రపంచ జనాభాలో 75 శాతానికి ప్రాతినిధ్యం వహించే దేశాలకు ఇందులో చోటు కల్పించదలిచారు. ఇండియా మాత్రం దీనిని బహిష్కరించింది. జి 20 ఢిల్లీ భేటీలో ప్రకటించిన ఇండియా మధ్యప్రాచ్యం దక్షిణాసియా యూరపు రైలు, రేవుల అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర వివరాలేమీ ఇంత వరకు బయటపడలేదు. ఈ చొరవను నిజమైన పెద్ద ఒప్పందంగా బైడెన్ అభివర్ణించారు. ఇతర దేశాలతో కలుపుకొని ప్రపంచ జీవ ఇంధన కూటమిని ఏర్పాటు చేయాలని ఢిల్లీ జి 20 సమావేశాల్లో చెప్పుకొన్న సంకల్పం బాగుంది. మొక్కజొన్న తదితర పంటల ద్వారా జీవ ఇంధనాన్ని తయారు చేసి పెట్రోల్ అవసరాన్ని తగ్గించుకోడానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ విషయంలో ఇంత వరకు అమెరికా, ఇండియా, బ్రెజిల్ దేశాలు ముందున్నాయి. నల్లసముద్రం మీదుగా ఉక్రెయిన్ ఆహార పదార్థాల ఎగుమతిని అడ్డుకోరాదని ఢిల్లీ డిక్లరేషన్ అభిప్రాయపడింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత నల్లసముద్రం రేవుల ద్వారా ఉక్రెయిన్ ఆహార పదార్థాల రవాణా కొనసాగేలా ఒక ఒప్పందం గత ఏడాది జులైలో కుదిరింది. కొన్ని మాసాలు గడిచిన తర్వాత తాను దీని నుంచి తప్పుకొంటున్నానని రష్యా ప్రకటించడం దానితో ఉక్రెయిన్ ఆహార సరఫరాలు ఆగిపోడం పర్యవసానంగా ఆహార సరకుల ధరలు పెరిగిపోడం జరిగాయి. జి20 ఢిల్లీ శిఖరాగ్ర సమావేశాలు అమెరికా పెత్తనంలో ఇండియా చాకచక్య నిర్వహణకు అద్దం పట్టాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News