Friday, December 20, 2024

లిబియాలో జల ప్రళయం.. 700 మంది మృతి.. 10,000 మంది గల్లంతు

- Advertisement -
- Advertisement -

కైరో : ఆఫ్రికా దేశమైన లిబియాలో డేనియల్ తుపాన్ జల ప్రళయం సృష్టించింది. ఇక్కడ కురిసిన భారీ వర్షాల కారణంగా ముంచుకొచ్చిన వరదల తీవ్రతకు రెండు డ్యామ్‌లు బద్దలై పోయాయి. దీంతో దిగువ ప్రాంతాలకు వరద పోటెత్తి సమీపం లోని సముద్రం లోకి ప్రజలను లాక్కెళ్లింది. ఈ వరద కారణంగా నివాస ప్రాంతాలు ఊడ్చిపెట్టుకు పోయాయి. ఎక్కడ చూసినా వాహనాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ ఉత్పాతంతో లిబియా తూర్పు నగరం డెర్నాలో దాదాపు 700 మంది ప్రాణాలు కోల్పోయారు. 10,000 మంది గల్లంతయ్యారు.

ఇక్కడ 2000 మంది వరకు మరణించి ఉంటారని మొదట అధికారులు అంచనా వేశారు. అంబులెన్స్, అండ్ ఎమర్జెన్సీ అథారిటీ గాలింపు చేపట్టి సహాయ కార్యక్రమాలు ప్రారంభించాక డెర్నా నగరంలో 2300 మంది మృతి చెందారని వెల్లడించింది. అయితే దేని ఆధారంగా ఈ సంఖ్య చెబుతున్నారో వివరించలేదు. రెడ్‌క్రాస్, రెడ్ క్రీసెంట్ సొసైటీల ఇంటర్నేషనల్ ఫెడరేషన్‌కు చెందిన లిబియా రాయబారి తామెర్ రమదాన్ అనుకోని ఈ వరదల ప్రళయానికి 10,000 మంది గల్లంతయ్యారని వెల్లడించారు. జెనీవా లోని ఐక్యరాజ్యసమితి వద్ద పాత్రికేయులతో టునీషియా నుంచి వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ భారీ సంఖ్యలో మరణాలు సంభవించాయని, ఈ సంఖ్య వేలల్లో పెరగవచ్చని పేర్కొన్నారు. శుక్రవారం మొరాకోలో సంభవించిన భూకంపాన్ని ఉదహరిస్తూ అదే విధంగా లిబియాలో జల ప్రళయం సంభవించిందని చెప్పారు.

తూర్పు లిబియా ప్రధాని ఒసామా హమాద్ ఈ ఉత్పాతం గురించి మాట్లాడుతూ రెండు డ్యామ్‌లు బద్దలైపోయి వరద పోటెత్తడం వల్లనే అనేక మంది గల్లంతయ్యారని చెప్పారు. డెర్నా నగరంలో జరిగిన ఈ ప్రళయం తమ దేశం సాధ్యాసాధ్యాలకు మించినదని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. డెర్నా నగరాన్ని విపత్తు జోన్‌గా ప్రకటించారు. ఈ వరదల్లో దాదాపు మూడు భారీ వంతెనలు కూడా కొట్టుకు పోయాయి. రాజధాని ట్రిపోలీకి తూర్పువైపున 900 కిమీ దూరంలో సముద్ర తీరం లోని పర్వతాల వద్ద డెర్నా నగరం ఉంది. ఇక్కడ నివాస గృహాలు చాలావరకు పర్వత లోయలో ఉన్నాయి. దీనికి సమీపం లోని ఒక డ్యామ్ బద్దలు కావడంతో ఈ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లోకి ఒక్కసారిగా భారీగా బురదనీరు చొచ్చుకు వచ్చింది. ప్రజలు తప్పించుకోడానికి కూడా అవకాశం లేకుండా పోయింది.

ప్రస్తుతం ఇక్కడ కమ్యూనికేషన్ లైన్లు కూడా నిలిచిపోయాయి. దీంతో వరద ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటో బయట ప్రపంచానికి తెలియని పరిస్థితి ఏర్పడింది. వాతావరణాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో ఈ ముప్పు వాటిల్లిందని లిబయా ఎమర్జెన్సీ అండ్ అంబులెన్స్ అథారిటీ చీఫ్ ఒసామా అల్యా వెల్లడించారు. సముద్ర మట్టం, వరద, గాలివేగం, వంటివి సరిగ్గా అధ్యయనం చేయలేకపోయామన్నారు. ఈస్థాయి ముప్పును లిబియా గతంలో ఎన్నడూ ఎదుర్కోలేదన్నారు. తూర్పుతీరం లోని అల్‌బెడ, అల్‌మర్జ్, తుబ్రోక్, టాకెనిస్, బెంగ్‌హజి నగరాలు కూడా వరదలకు దెబ్బతిన్నాయి. డెర్నా నగర పరిసరాల్లో శిధిలాల కింద చాలా మృతదేహాలు ఇరుక్కుని ఉండడమో లేదా సముద్రం లోకి కొట్టుకునిపోవడమో జరిగిందని లిబియా ఆరోగ్యమంత్రి అబ్దుల్ జలీల్ వెల్లడించారు.

పర్వతాల నుంచి డెర్నా నగరం మీదుగా ప్రవహించే వాడి డెర్నా నది వెంబడి ఉన్న మొత్తం నివాసాలు వరదతో తుడిచిపెట్టుకుపోయాయి. బహుళ అంతస్తుల భవనాలు పాక్షికంగా కూలి బురదమయంగా మారాయి. నగరం మొత్తం ఎక్కడా ప్రవేశించలేనంతగా శవాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని అబ్దుల్ జలీల్ పేర్కొన్నారు. అత్యవసర సిబ్బంది, సైనిక దళాలు, ప్రభుత్వ సిబ్బంది, వాలంటీర్లు , స్థానిక ప్రజలంతా కలిసి శిధిలాలను తొలగించడంలోను, శవాలనువెలికి తీయడం లోనూ నిమగ్నమయ్యారు. నీటి లోంచి శవాలను వెలికి తీయడానికి పడవలను ఉపయోగిస్తున్నారు. నగరం మధ్య లోకి రాత్రి వరద నీరు చొచ్చుకు వచ్చినప్పుడు భారీ శబ్దాలు వినిపించాయని, నగరం వెలుపలి డ్యామ్‌లు కూలిపోయాయని అనుకున్నామని స్థానికులు భయంకర అనుభవాలను వివరించారు.

సోమవారం ఒక శ్మశాన వాటికలో దాదాపు 200 మృతదేహాలను పూడ్చి పెట్టామని కూలీలు చెప్పారు. అక్కడి ఫుటేజీ దృశ్యాలు పరిశీలిస్తే డెర్నా నగరం ఆస్పత్రి నేలపై అనేక శవాలు దుప్పట్లు చుట్టి ఉండడం కనిపించింది. తూర్పు లిబియా లోని మరికొన్ని ప్రాంతాలను కూడా తుపాను తుడిచిపెట్టి వేసింది. బేడా పట్టణంలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. బేడా లోని ప్రధాన ఆస్పత్రి రోగులతో కిక్కిరిసి పోయింది. సుసా, మర్జ్, షాహట్, బెంఘాజీ తదితర నగరాల్లో వందలాది మంది నిర్వాసితులై స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయ భవనాల్లో తలదాచుకుంటున్నారు. తూర్పు, పశ్చిమ లిబియా ప్రభుత్వాధికారులు డెర్నా నగర ప్రజలకు సహాయం కోసం పరుగులెత్తారు. 14 టన్నుల ఔషధాలు, బాడీ బేగ్స్ తదితర వైద్య అవసరాలను విమానంలో డెర్నాకు తీసుకెళ్తున్నట్టు ట్రిపోలీ లోని ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. బెంఘాజీ నగరానికి మంగళవారం హెల్త్ కేర్ వర్కర్లు తరలి వెళ్లారు. డెర్నాకు సహాయంగా మానవతాసాయం అందిస్తామని ఇతర సేవా సంస్థలు ప్రకటించాయి.

విదేశాల సహాయ హస్తం
ఈజిప్టు, టునీషియా, అల్జీరియా, టర్కీ , యుఎఇ, తదితర దేశాలు లిబియా సహాయం కోసం తమ సేవా సహాయ బృందాలను పంపిస్తామని, ప్రకటించాయి. వరద బాధిత ప్రాంతాలకు సహాయం ఏ విధంగా అందించగలమో తెలుసుకోడానికి ఐక్యరాజ్యసమితిని, లిబియా అధికార యంత్రాంగాన్ని తాము సోమవారం సంప్రదించామని అమెరికా దౌత్య కార్యాలయం వెల్లడించింది.

లిబియాకు అత్యవసర సహాయం అందించడానికి మిలిటరీ కమాండర్లతో అత్యవసరంగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా సమావేశమయ్యారు. మిలిటరీ అక్కడకు వెళ్లి సహాయం అందిస్తుందని చెప్పారు. లిబియా లోని తమ కార్యాలయం పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తోందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. చాలా దేశాలు తమ సహాయక బృందాలను లిబియాకు తరలించాయి. ఈజిప్ట్ అధ్యక్షుడు ఎల్‌సిసి ఈ వరదలలో మృతులకు సంతాపం తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News