సిమ్లా : అమెరికా నుంచి దిగుమతయ్యే యాపిల్స్‌పై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ తగ్గించడాన్ని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తప్పుపట్టారు. దేశంలో యాపిల్ పెంపకందారులు సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో అమెరికా యాపిల్స్ దిగుమతులను సరళతరం చేయడం పట్ల ఆమె విస్మయం వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను ప్రియాంక గాంధీ మంగళవారం సందర్శించారు. వరదలతో రైతాంగం నష్టపోయిన క్రమంలో అమెరికన్ యాపిల్ దిగుమతులపై కేంద్రం కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం రైతుల కష్టాలను రెట్టింపు చేస్తుందని ప్రియాంక గాంధీ వాపోయారు.
సిమ్లాలో యాపిల్స్ సేకరణ ధరలను పారిశ్రామికవేత్తలు తగ్గించారని, ఇక్కడ యాపిల్స్ పండించే వారు ఇబ్బందిపడుతుంటే అమెరికా నుంచి దిగుమతయ్యే యాపిల్స్‌సై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం ఎవరిని ఉద్దరించడానికని ఆమె కేంద్రాన్ని నిలదీశారు. అమెరికాలో రైతుల బాగు కోసం ఇలా చేశారా? అని ప్రియాంక గాంధీ మోదీ సర్కార్ను ప్రశ్నించారు. స్ధానిక రైతులు తమ పంటకు సరైన ధర లభించేలా ప్రభుత్వం తోడ్పాటు అందించాలని అన్నారు.
పప్పు ధాన్యాలు, బాదం, వాల్‌నట్స్, యాపిల్స్, బోరిక్ యాసిడ్ వంటి నిర్ధిష్ట అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లు తగ్గించేందుకు ఈ ఏడాది జూన్లో భారత్ అంగీకరించిందని అమెరికా వాణిజ్య రిప్రెజెంటేటివ్ ప్రకటన పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్లో వరదలను జాతీయ విపత్తుగ ప్రకటించాలని ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా అమెరికా నుంచి దిగుమతయ్యే యాపిల్స్పై కస్టమ్స్ సుంకం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జమ్ము కశ్మీర్ మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా పలువురు కశ్మీర్ నేతలు తప్పుపట్టారు.