Sunday, December 22, 2024

అంగన్‌వాడీలకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

రిటైర్మెంట్ వయోపరిమితిని 65 ఏళ్లుగా నిర్ధారిస్తూ జిఒ జారీ
సిఎం కెసిఆర్‌కు మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేక కృతజ్ఞతలు

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేసింది. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు ఉద్యోగ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంచి ప్రత్యేక ఆర్థిక సాయం కింద అంగన్‌వాడీ టీచర్‌లకు రూ. లక్ష, మినీ అంగన్‌వాడీ టీచర్‌లు, హెల్పర్‌లకు రూ.50 వేలు ఇవ్వనుంది. ఉద్యోగ విరమణ తర్వాత ఆసరా పెన్షన్ మంజూరు చేయనుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంఉత్తర్వులు జారీ చూసింది.

అంగన్ వాడి టీచర్లకు, హెల్పర్ లకు 50 ఏండ్ల వరకు 2లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం, 50 ఏండ్లుదాటిన వారికి 2 లక్షల రూపాయల ఏక్స్ గ్రేషియా ప్రకటించింది. సర్వీస్‌లో ఉండి మరణిస్తే తక్షణ సాయం కింద టీచర్లకు 20వేలు, హెల్పర్లుకు 10 వేలు సాయం అందించనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జీవోలు జరీచేయడం పట్ల మం త్రి సత్యవతి రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీలకు పెద్ద పేట వేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు. ప్రతినెల 14వ తేదీ లోపు జీతా లు చెల్లిస్తున్నామన్నారు.

దేశంలోనే అంగన్‌వాడీ లు చేస్తున్న సేవలకు గుర్తింపు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తెలిపారు. కోవిడ్ సమయంలో అంగన్‌వాడీల సేవలను గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు అందజేశాయని గుర్తు చేశారు. అంగన్‌వాడీలు సమ్మె విరమింప చేయాలని కోరారు. అంగన్‌వాడీలు కేం ద్రం ప్రభుత్వ పరిధిలో ఉన్న డిమాండ్లతో సమ్మె చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న డిమాండ్లను నెరవేర్చామని అన్నారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తరుపున సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

అంగన్‌వాడీలకు పనిఒత్తిడి తగ్గించే విధంగా యాప్ సులభతరం చేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో మంత్రి సత్యవతి రాథోడ్ అంగన్‌వాడీ టీచర్లకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లకు అత్యధిక వేతనాలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. ఇప్పటికే మన రాష్ట్రంలో అంగన్‌వాడీ టీచర్లకు రూ.13,650, మినీ అంగన్‌వాడీ టీచర్లకు రూ.7,800, హెల్పర్లకు రూ.7,800 చొప్పున వేతనాలు ఇస్తున్నామన్నారు.

గత ప్రభుత్వాల హయాంలో మరుగునపడిన అంగన్‌వాడీలకు, ఆత్మగౌరవాన్ని కల్పించింది ముఖ్యమంత్రి కెసిఆరేనని మంత్రి అన్నారు. వారిని వర్కర్లు అనకుండా టీచర్లుగా సంబోధించాలని ఆదేశాలు ఇచ్చారని, అంగన్‌వాడీల వేతనాలను పిఆర్సీలో పెట్టారని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 115 కోట్ల భారం భరిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 70 వేల మంది అంగన్‌వాడిలకు లబ్ధి చేకూతుందని తెలిపారు. మహిళలు, శిశువుల ఆరోగ్యం కోసం తల్లి తర్వాత తల్లిలాగా సేవలందిస్తున్న అంగన్‌వాడీలను అంతే గౌరవంగా చూస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ వారికి అన్ని విధాల ప్రాధాన్యత ఇస్తున్నారన్నారని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News