అమరావతి: జగనన్న సురక్ష తరహాలోనే ఆరోగ్య సురక్ష చేపట్టాలని అధికారులకు సిఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. సెప్టెంబర్ 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు అధికారులతో జరిగిన సమీక్షలో సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా అనే అంశంపై ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ రూపొందించిన బ్రోచర్ ను సిఎం వైయస్ జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. సురక్ష తరహాలోనే ప్రతి ఇంటికెళ్లి ఆరోగ్య సమస్యలను తెలుసుకోవాలని, ఫ్యామిలీ డాక్టర్ విలేజ్ క్లినిక్ ద్వారా సమస్యలను పరిష్కరిస్తామని, సమస్యలను బట్టి హెల్త్ క్యాంప్ నిర్వహించాలని సూచించారు. పరీక్షలు చేయడంతో పాటు మందులు, కళ్లద్దాలు ఇవ్వాలని, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి చికిత్స అందించాలని పేర్కొన్నారు. ప్రతి మండలంలో నెలకు నాలుగు గ్రామాల్లో హెల్త్ క్యాంప్‌లు నిర్వహించాలని, రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని చెప్పారు.
Also Read: చంద్రబాబు జీవితమంతా రక్తసిక్తమే: భూమన