దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కెరీర్‌లోనే అత్యుత్తమ రెండో ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన గిల్ తాజా ర్యాంకింగ్స్‌లో ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. గిల్ ప్రస్తుతం 759 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచాడు. ఇక పాకస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 863 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
ఆసియాకప్ బాబర్ నిలకడగా ఆడడంతో అతని టాప్ ర్యాంక్‌కు ఢోకా లేకుండా పోయింది. ఇక దక్షిణాఫ్రికా సిరీస్‌లో రాణిస్తున్న డేవిడ్ వార్నర్ ఒక ర్యాంక్‌ను మెరుగు పరుచుకుని నాలుగో స్థానానికి చేరుకున్నాడు. పాక్ ఆటగాడు ఇమామ్ ఉల్ హక్ ఒక ర్యాంక్ కోల్పోయి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత స్టార్లు విరాట్ కోహ్లి 8వ ర్యాంక్‌లో, కెప్టెన్ రోహిత్ శర్మ తొమ్మిదో ర్యాంక్‌కు చేరుకున్నారు. బౌలింగ్ విభాగంలో భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్ ఒక ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నాడు. ప్రస్తుతం అతను ఏడో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.
హైదరాబాదీ స్పీడ్‌స్టర్ సిరాజ్ తన 9వ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోస్ హాజిల్‌వుడ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాకే చెందిన మిఛెల్ స్టార్క్ రెండో, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక ఐసిసి బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియాకు చెందిన ముగ్గురు బ్యాటర్లు చాలా రోజుల తర్వాత టాప్10లో చోటు సంపాదించడం విశేషం. ఈసారి గిల్‌తో పాటు కోహ్లి, రోహిత్ శర్మలు తొలి పది ర్యాంకింగ్స్‌లో స్థానాన్ని దక్కించుకున్నారు. గతంలో రోహిత్, కోహ్లి, శిఖర్ ధావన్‌లు ఇలాంటి ఘనతను సాధించారు.