Saturday, November 23, 2024

లక్ష్యం దాటిన ఖరీఫ్ సాగు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్రం లో ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం వందశాతానికి చేరుకుంది. బుధవారం నాటికి రాష్ట్రంలో అన్ని రకాల పంటలు కలిపి 1,25,05,641 ఎకరాల విస్తీర్ణంలో సాగులోకి వచ్చాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 1.24 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయించాలని వ్యవసాయశాఖ ప్రాధమిక ప్రణాళిక రూపొందించింది. వర్షాల రాక ఆలస్యం, కృష్ణానదీపరివాహకంగా ఆశించిన రీతిలో వదర నీరు ప్రాజెక్టులకు చేరక పోవటంతో పంటల సాగు విస్తీర్ణం మందకోడిగా సాగుతూ వచ్చింది. ఒక దశలో వర్షాలు సు మారు రెండు వారాలకు పైగా బిగదీసుకుపోవటంతో వర్షాధార పంటల పరిస్థితి ఆందోళనకరంగా మా రింది. వ్యవసాయరంగం పైన కరువు ఛాయలు కమ్ముకుంటున్న పరిస్థితుల్లో భారీ వర్షాలు ఊరట నిచ్చాయి. గోదావరి నదీపరివాహకంగా ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నిండిపోయాయి. దీంతో ఖరీఫ్ పంటలసాగుపై భరోసా పెరిగింది.రాష్ట్రంలో ఈ సీజన్‌కు సంబంధించి ఈ సమయానికి 1.18కోట్ల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగులోకి రావాల్సివుంది. అయితే ఇప్పటివరకూ 100.62శాతం విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చాయి.

63.55లక్షల ఎకరాల్లో వరినాట్లు :
రాష్ట్రంలో ఇప్పటివరకూ 63.55లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరినాట్లు పడ్డాయి. వ్యవసాయశాఖ ఖరీఫ్‌లో మొత్తం 49.86లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరిసాగును అంచనా వేసింది. ఈ సమయానికి 44.45 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడాల్సివుంది. అయితే నీటివనరుల లభ్యత పెరగటంతో రైతులు ఉత్సాహంగా వరినాట్లు వేశారు. ఇప్పటికే సాధారణ వరిసాగు విస్తీర్ణంతో పోలిస్తే 127.46శాతం విస్తీర్ణంలో వరిసాగులోకి వచ్చింది. జొన్న 30891 ఎకరాలు, సజ్జ 372 ఎకరాలు, మొక్కజొన్న 5.41లక్షల ఎకరాలు , రాగి 386 ఎకరాలు సాగులోకి వచ్చాయి. పప్పుధాన్య పంటల్లో కూడా కంది 4.73లక్షల ఎకరాలు, పెసర 55703 ఎకరాలు, మినుము 19916 ఎకరాలు, ఉలవ 225 ఎకరాలు, అలసంద తదితర ఇతర పప్పుధాన్య పంటలు మరో 332 ఎకరాల్లో సాగులోకి వచ్చాయి. మొత్తం 5.49లక్షల ఎకరాల సాగుతో పప్పుధాన్య పంటల విస్తీర్ణం 58.24శాతానికి చేరుకుంది. నూనెగింజ పంటల సాగు విస్తీర్ణం కూడా 93.53శాతానికి చేరుకుంది. 14696 ఎకరాల్లో వేరుశనగ, 3878 ఎకరాల్లో ఆముదం, 4.66లక్షల ఎకరాల్లో సోయాబిన్ పంటలు సాగులోకి వచ్చాయి. ప్రధాన వాణిజ్యపంటల సాగులో పత్తిసాగు 45లక్షల ఎకరాల వద్దనే ఆగిపోయింది. పొగాకు 1664 ఎకరాలు, చెరకు సాగు 35823 ఎకరాల్లో జరిగింది. ఇక ఈ వారాంతానికి ఖరీఫ్ పంటల సాగు ముగిసిపోనుందని అధికారులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News