Saturday, November 23, 2024

నేడు బంగ్లాతో భారత్ పోరు..

- Advertisement -
- Advertisement -

ఫైనల్‌కు రిహార్సల్.. నేడు బంగ్లాతో భారత్ పోరు
కొలంబో: ఆసియాకప్‌లో ఇప్పటికే ఫైనల్‌కు చేరుకున్న టీమిండియా శుక్రవారం బంగ్లాదేశ్‌తో సూపర్4 మ్యాచ్‌ను ఆడనుంది. ఆదివారం ఫైనల్‌కు ముందు జరుగుతున్న మ్యాచ్ కావడంతో దీన్ని రిహార్సల్‌గా ఉపయోగించుకోవాలని భారత్ భావిస్తోంది. బంగ్లాదేశ్ ఇప్పటికే ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడడంతో బంగ్లా ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. ఇక టీమిండియా సూపర్4లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి తుది పోరుకు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని తహతహలాడుతోంది. బంగ్లాదేశ్‌తో పోల్చితే భారత్ చాలా బలంగా ఉంది. శ్రీలంక, పాకిస్థాన్ వంటి బలమైన జట్లను ఓడించడంతో టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. బంగ్లాను కూడా ఓడించి హ్యాట్రిక్‌ను నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది.

ఓపెనర్లే కీలకం..
ఆసియాకప్‌లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు అత్యంత నిలకడైన ఆటను కనబరుస్తున్నారు. రోహిత్ ఇప్పటికే వరుసగా రెండు అర్ధ సెంచరీలు నమోదు చేసి సత్తా చాటాడు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నాడు. గిల్ కూడా జోరుమీదున్నాడు. ఇద్దరు మరోసారి శుభారంభం అందించాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వీరిలో ఏ ఒక్కరూ నిలదొక్కుకున్నా బంగ్లా బౌలర్లకు కష్టాలు ఖాయం. మరోవైపు విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్‌లు ఇప్పటికే పాకిస్థాన్ మీద శతకం సాధించి జోరుమీదున్నారు. బంగ్లాపై కూడా చెలరేగాలనే పట్టుదలతో ఉన్నారు.

కిందటి మ్యాచ్‌లో విఫలమైన కోహ్లి ఈసారి మెరుగైన ఇన్నింగ్స్ ఆడాలనే లక్షంతో ఉన్నాడు. రాహుల్ దూకుడు మీద ఉండడం భారత్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. ఇక హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. బౌలింగ్‌లో కూడా భారత్ పటిష్టంగా కనిపిస్తోంది. బుమ్రా, సిరాజ్, షమి, కుల్దీప్, హార్దిక్, జడేజా వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. కుల్దీప్ యాదవ్ ఆసియాకప్‌లో కళ్లు చెదిరే ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

పరువుకోసం..
మరోవైపు వరుస ఓటములతో సతమతమవుతున్న బంగ్లాదేశ్ కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలవాలని భావిస్తోంది. అయితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో వైఫల్యం జట్టును వెంటాడుతోంది. కీలక ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నారు. కీలక ఆటగాళ్లు విఫలం అవుతుండడం జట్టుకు సమస్యగా తయారైంది. రానున్న వరల్డ్‌కప్‌నకు ముందు ఆటగాళ్లు ఫామ్ లేమీతో బాధపడుతుండడం బంగ్లాను కలవరానికి గురిచేస్తోంది. భారత్ వంటి బలమైన జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌కు భారత్‌ను ఓడించడం శక్తికి మించిన పనిగానే చెప్పాలి. కానీ షకిబ్, రహీం, షాంటో, ఆఫిఫ్ తదితరులతో బంగ్లా బలంగానే ఉంది. సమష్టిగా రాణిస్తే సంచలన విజయం సాధించడం బంగ్లాకు అసాధ్యమేమీ కాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News