Sunday, December 22, 2024

డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా సకల సౌకర్యాలతో కూడిన వారి సొంతింటి కలను నిజం చేస్తున్న దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మాత్రమేనని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేదలంతా ఆత్మగౌరవంతో జీవించాలన్న ధ్యేయంతో బిఆర్‌ఎస్ ప్రభుత్వ వారికి ఉచితంగా డబల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తున్నామన్నారు. శుక్రవారం హైదరాబాద్ కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో రెండవ విడత ఆన్ లైన్ లాటరీ ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు కార్యక్రమం నిర్వహించారు.

మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, జిహెచ్‌ఎంసి మేయర్ విజయ లక్ష్మి,ఎమ్మెల్యే లు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్ అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, ముఠా గోపాల్, ప్రకాష్ గౌడ్,ఎమ్మెల్సీలు ప్రభాకర్ ,వాణి దేవి, మీర్జా రహమత్ బేగ్, జిహెచ్‌ఎంసి కమీషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్,మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ల సమక్షంలో రాండ మైజేషన్ సాఫ్ట్ వెర్ ద్వారా ఆన్ లైన్ డ్రా నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేశారు. జిహెచ్‌ఎంసి పరిధిలోని 24 నియోజక వర్గాలలో రెండవ విడతగా మరో 11, 700 మంది లబ్దిదారులను ఎంపిక చేసినట్లు మంత్రి తలసాని తెలిపారు.

రెండవ విడత ప్రక్రియలో వికలాంగులు ఎస్సీ ఎస్టీ వారికి రిజర్వేషన్ కల్పించడంతో వికలాంగులకు 470 ఎస్సీలకు 1,923,ఎస్టీలకు 655, ఇతరులకు 8652 కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. కేటాయింపులో ఎలాంటి ఎవరి జోక్యం లేకుండా పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. మానవ ప్రయత్నంతో లాటరీ ద్వారా కేటాయింపు చేసే ప్రక్రియ కన్నా ఇది ఎన్నో రేట్లు నాణ్యత, పారదర్శకత, జవాబుదారీ తనాన్ని సూచిస్తుందని అన్నారు. ఇళ్లు రాని వారు ఏలాంటి భయాందోళనలు పడోద్దని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మంత్రి అన్నారు. పేద ,మధ్య తరగతి వారు ఎంతో గొప్పగా బ్రతకాలని ఉద్దేశంతో ఖరీదైన ప్రాంతాలలో ఇల్లు కట్టించి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు.

జిహెచ్‌ఎంసి కమీషనర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, ఎన్‌ఐసి సిబ్బంది ప్రధాన భూమిక పోషించారని మంత్రి వారికీ అభినందనలు తెలిపారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ రెండవ విడత డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా జరగాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్‌ఐసి సహకారంతో రాండ మైజేషన్ సాఫ్ట్ వెర్ ద్వారా ప్రజా ప్రతినిధుల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియ లో తారుమారు చేసే అవకాశం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్, డిఆర్‌ఓ వెంకటాచారి, హైదరాబాద్ ఆర్టీవోలు సూర్యప్రకాష్, రవికుమార్,ఎన్‌ఐసి అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News