నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో లిఫ్ట్ కూలి నలుగురు కార్మికులు మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో ఐదురుగురు కార్మికులను జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలియజేశారు. అమ్రపాలి డ్రీమ్ వ్యాలీ సొసైటీలో నిర్మాణ ప్రదేశఃలో ఉదయం 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. చాలా కాలంగా నిర్మాణం ఆగిపోయిన ఈ ప్రాజెక్టును రాష్ట్రప్రభుత్వ అధీనంలోని ఎన్‌బిసిసి పూర్తి చేస్తోంది. గ్రౌండ్‌ఫ్లోర్‌నుంచి వర్కర్లను పైఅంతస్థులోకి తీసుకెళ్లే సర్వీస్ లిఫ్ట్ ఒక్క సారిగా14వ అంతస్థునుంచి పడిపోవడంతో నలుగురు కార్మికులు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
నలుగురు కార్మికులు చనిపోయారని, గాయపడిన మరో అయిదురు ఆస్పత్రిలో విషమ పరిస్థితిలో ఉన్నారని జిల్లా మేజిస్ట్రేట్ మనీశ్ వర్మ చెప్పారు. లేబర్ కోడ్ నిబంధనల ప్రకారం మృతులకు నష్టపరిహారాన్ని తాము సిఫార్సు చేశామని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా ముందుజాగ్రత్త చర్యగా నిర్మాణంలో ఉన్న భవనం చుట్టుపక్కల నివసిస్తున్న కార్మికుల కుటుంబాలను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. అయితే ఉన్నట్లుండి తామంతా ఎక్కడికి వెళ్లాలని అక్కడి కార్మికులు ప్రశ్నిస్తున్నారు.