చండీగఢ్: కశ్మీర్‌లో ఉగ్రఘాతుకానికి బలయిన కల్నల్ మన్‌ప్రీత్‌సింగ్ అంత్యక్రియలు పంజాబ్‌లోని మొహాలీ జిల్లా ఆయన స్వగ్రామంలో శుక్రవారం జరిగాయి. కల్నల్ మన్‌ప్రీత్‌సింగ్ అంత్యక్రియల్లో చోటు చేసుకున్న దృశ్యాలు ప్రతి మానవ హృదయాన్నిమెలిబెడుతున్నాయి. మన్‌ప్రీత్‌సింగ్ భౌతిక కాయం శుక్రవారం ఉదయం ఆయన స్వస్థలం ముల్లాన్‌పూర్‌కు తీసుకువచ్చారు. మృతదేహాన్ని చూడగానే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. పెద్ద సంఖ్యలో గ్రామస్థులు ఆయన నివాసానికి చేరుకుని అమర జవానుకు అంతిమ నివాళి అర్పించారు. మరో పక్క సింగ్ ఆరేళ్ల కుమారుడు సైనిక దుస్తుల్లో తండ్రికి వీడ్కోలు సెల్యూట్ చేశాడు. పక్కనే ఉన్న చెల్లి అన్నను అనుకరించింది. ఈ ఇద్దరికీ అక్కడ ఏం జరుగున్నదో అర్థం కాని పరిస్థితి. వారికి అంత వయసు కూడా లేదు.
కల్నల్ దూరమైన బాధ, పసి పిల్లల అమాయకత్వం అక్కడున్న ప్రతి ఒక్కరి మనసును బరువెక్కించింది.అంత్యక్రియలు పూర్తి సైనిక మర్యాదలతో జరిగాయి. పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, మాజీ ఆర్మీ చీఫ్ వి పి మాలిక్, రాష్ట్ర మంత్రులు చేతన్ సింగ్ జౌరమార్జా, అన్‌మోల్ గగన్ మాన్, ఆర్మీ సీనియర్ అధికారులు అంత్యక్రియలకు హాజరయి భౌతిక కాయంపై పుష్పగుచ్ఛాలుంచి తుది నివాళి సమర్పించారు. కల్నల్ సింగ్ చదివిన స్కూల్ టీచర్లు కొందరు కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు.19వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు కల్నల్ సింగ్ కమాండింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ లోని కొకెన్ నాగ్‌కు చెందిన గడోల్ అడవుల్లో ఉగ్రాదులకు, భద్రతా దళాలకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో కలల్ మన్‌ప్రీత్ సింగ్‌తో పాటుగా మేజర్ ఆశిష్ ధోనక్ , డిఎస్‌పి హుమాయూన్ సహా మరో సైనికుడు అమరులయ్యారు.
ముగ్గురు కీలక అధికారులు మృతి చెందడంతో ఆర్మీ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. పెద్ద ఎత్తున బలగాలను ఆ ప్రాంతానికి తరలించింది. దీంతో మూడు రోజులుగా ఎన్‌కౌంటర్ జరుగుతోంది. మరో పక్క ఆశిష్ భౌతిక కాయాన్ని ఆయన పానిపట్‌లోని ఆయనస్వస్థలానికి తరలించారు. ఆయన అంతిమయాత్రలో భారీ సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు. ఆశిష్‌కు రెండేళ్ల కుమార్తె ఉంది. కాగా భట్ అంత్యక్రియలు గురువారం ముగిశాయి.