Saturday, November 23, 2024

కెసిఆర్‌ను ఎదుర్కోలేకనే కవితకు పదే పదే ఈడి నోటీసులు

- Advertisement -
- Advertisement -

క్లీన్ చిట్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ ఎందుకు ఇబ్బంది పెడతున్నారు?
కేంద్రం తీరుపై ప్రజా సంఘాల జెఎసి  చైర్మన్ గజ్జెల కాంతం మండిపాటు

మన తెలంగాణ / హైదరాబాద్ : సిఎం కెసిఆర్‌ను ఎదుర్కొలేకనే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎంఎల్‌సి కవితకు పదే పదే ఈడీ నోటీసులు జారీ చేస్తోందని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం మండిపడ్డారు. అన్యాయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితను ఇంతకు ముందు ఈడి దాడుల పేరిట ఇబ్బంది పెట్టిన బిజెపి ప్రభుత్వం అప్పుడు క్లిన్ చిట్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ కవితను ఇబ్బందుల పాలు జేస్తోందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నాయని, బిజెపి పార్టీ చరిష్మా తెలంగాణలోనూ మసక బారడంతో మరొక సారి కవిత మీద ఈడి దాడులు చేయించి అధికార పార్టీని భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటోందన్నారు. ఈ మేరకు సోమజిగూడా ప్రెస్ క్లబ్‌లో ప్రయివేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు , పూసలు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోలా శ్రీనివాస్ , ఉస్మానియా జేఏసీ నేత డా. సంజీవ్ నాయక్ తదితరులతో కలిసి మీడియా సమావేశంలో గజ్జల కాంతం మాట్లాడారు.

దేశంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తోందన్నారు. ఏపిలో ప్రతిపక్ష నేత చంద్రబాబును జైలు పాలు చేశారని, అసలు బిజెపి పార్టీకి దక్షిణాది రాష్ట్రాల ప్రజలు అంటేనే ఇష్టం లేదన్నారు. ఎందుకుంటే ఈ రాష్ట్రాల్లో బిజెపియేతర ఇతర పార్టీలకే అధికారం వస్తోందన్నదే వారి బాధ అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇక్కడి నాయకుల మీద బిజెపి అక్రమంగా ఈడి , సీబీఐ దాడులు చేయిస్తుందన్నారు. ఈ నెల 18 వ తేదీ నుండి జరిగే అత్యవసర పార్లమెంట్ సమావేశాలలో దమ్ము ఉంటే మణిపూర్ , హర్యానా రాష్ట్రాల్లో జరిగిన అల్లర్ల ప్రస్తావన తీసుకు వచ్చి చర్చించాలని గజ్జల కాంతం డిమాండ్ చేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రజానీకం దేశ వ్యాప్తంగా బిజెపి అరాచక పాలనను గమనిస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రజా నాయకుల మీద బిజెపి ముప్పేట దాడిని యావత్ తెలంగాణ ప్రజలు ఖండిస్తున్నారన్నారు. అత్యంత పారదర్శక పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబం మీద ఓర్వలేక బిజెపి బురద జల్లే ప్రయత్నం చేస్తోందన్నారు. ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితకు తెలంగాణ ప్రజలు , ప్రజా ప్రతినిధులు , యావత్ తెలంగాణ సమాజం అండగా ఉంటుందన్నారు. రానున్న రోజులలో బిజెపి ప్రభుత్వం లోని మోడీ , అమిత్ షా , ఆర్‌ఎస్‌ఎస్‌ను ఈ దేశం నుండి వెల్లగొట్టే పరిస్థితులు వస్తాయన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News