వాషింగ్టన్ : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కందుల జాహ్నవి మృతి విషయంలో బాధ్యులైన సీటెల్ పోలీసు అధికారి డేనియల్ అడెరర్ వివరణ ఇచ్చుకున్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన తెలిపినట్లు, ఈ వ్యాఖ్యలు అప్పటి సందర్భానికి సంబంధించినవి కావని చెప్పినట్లు సీటెల్ పోలీసు అధికారుల గిల్డ్ ఆయనను సమర్థించింది. 23 సంవత్సరాల జాహ్నవి జనవరి 23వ తేదీన సీటెల్‌లో రోడ్డు దాటుతూ ఉండగా గంటకు 119 కిలోమీటర్ల వేగంతో వచ్చిన పోలీసు వాహనం వచ్చి ఈమెను బలంగా ఢీకొంది.
ఈ ఘటనలో ఆమె వంద మీటర్ల దూరం వరకూ ఎగిరిపడి మృతి చెందింది. ఈ దశలో వాహనాన్ని పోలీసు అధికారి కెవిన్ నడుపుతున్నాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించి తరువాత వెలువడ్డ వీడియోలతో ఈ పోలీసు అధికారి తీరుపట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అయింది. ఆయనపై కఠిన చర్యలకు డిమాండ్లు వెలువడ్డాయి. తాను ఈ ఘటన పట్ల నవ్వలేదని, కేసు దర్యాప్తు క్రమంలో తన ముందుకు వచ్చిన దశలో తన వ్యాఖ్యలను వక్రీకరించారని డేనియల్ తెలిపారు. . కాగా ఈ యువతి విషాదాంతం తరువాతి వ్యాఖ్యలపై ఈ పోలీసు అధికారిని పదవి నుంచి తొలిగించాలని ఆన్‌లైన్ పిటిషన్ దాఖలు అయింది.