నర్సంపేట: తొంటి విరిగి ఆపరేషన్‌కు అని ఆసుపత్రికి వస్తే ఓ గిరిజన వృద్ధుడి ప్రాణమే పోయింది. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు లేకుండా వైద్యుడి నిర్లక్షం వల్లనే మృతి చెందాడని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగిన సంఘటన నర్సంపేటలో ఆదివారం చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. నర్సంపేట మండలం బోజ్యనాయక్‌తండాకు చెందిన బానోతు భద్రు తొంటి ఆపరేషన్ కోసం పట్టణంలోని అమ్మ ఆసుపత్రిలో గత మూడు రోజుల క్రితం అడ్మిట్ అయ్యాడు. అతనికి ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్‌కు ముందు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాల్సిన వైద్యులు సరిగా పరిశీలించలేదు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ కోసం అనుమతి రాగానే శనివారం సాయంత్రం ఆగమేఘాల మీద ఆపరేషన్ చేయగా ఆపరేషన్ చేసిన కొన్ని గంటలకే భద్రు మృతి చెందాడు.
దీంతో ఆసుపత్రి నిర్వాహకులు భద్రు మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా అతని స్వగ్రామానికి తరలించారు. దీంతో తండావాసులు ఆదివారం ఉదయం ఆసుపత్రి దగ్గరకు చేరుకొని ఆందోళన చేశారు. ఆపరేషన్ చేయడానికి ముందుగా రోగి కండీషన్ గుర్తించకపోవడం వల్లనే గుండెపోటు వచ్చి ఉంటుందని ఆపరేషన్ చేయకపోయిన భద్రు బతికేవాడని మృతుని బంధువులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకొని ఆందోళన కారులను శాంతింప చేశారు. కుటుంబ సభ్యులతో ఆసుపత్రి నిర్వాహకులు మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా నర్సంపేట పట్టణంలో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇలా వైద్యుల నిర్లక్షం మూలంగా ప్రాణాలు పోతున్నాయని ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ విషయమై డిప్యూటీ డిఎంహెచ్‌ఓ ప్రకాష్ మాట్లాడుతూ అమ్మ ఆసుపత్రిలో భద్రు అనే వ్యక్తి మృతిచెందినట్లు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఆపరేషన్‌కు ముందు పేషంట్ కండీషన్‌ను పూర్తిస్థాయిలో గుర్తించి ఆపరేషన్ చేస్తారని తెలిపారు. ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై విచారణ చేస్తామన్నారు.