కనుల పండువగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : నిజాంపై అలుపెరుగని పోరాటం అచంచల దేశభక్తికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించారు. ఈ వేడుకల్లో అమిత్ షాతో పాటు కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. తొలుత అమిత్ షా పోలీస్ అమరవీరుల స్మృతిస్థల్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన.. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను అమిత్ షా సన్మానించారు. షోయబుల్లాఖాన్, రాంజీ గోండుల స్మారకంగా..స్పెషల్ పోస్టల్ కవర్ ఆవిష్కరించారు. వేడుకల్లో భాగంగా లోపలు సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ ఆట పాట, కోయనృత్యాలు, డప్పు కళాకారుల ప్రదర్శనలు, బోనాలు, పోతురాజుల విన్యాసాలు, ఒగ్గు కళాకారుల ప్రదర్శనలను అమిత్ షా తిలకించారు. వివిధ ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ హైదరాబాద్ విముక్తికి అమరులైన వీరులందరికీ నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. సర్ధార్ పటేల్ లేకపోతే అంత త్వరగా తెలంగాణ విముక్తి లభించేది కాదన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం గురించి దేశ ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారు. రావి నారాయణరెడ్డి. కాళోజీ, బద్దం ఎల్లారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు. నరసింహారావుకు నా నివాళులర్పిస్తున్నా ఆపరేషన్ పోలో పేరుతో నిజాం మెడలు పటేల్ వంచారు. రక్తం చిందకుండా నిజాం రజాకారులు లొంగిపోయేలా చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం గత పాలకులు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు లేకుండానే ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. అనంతరం ప్రధాని పుట్టినరోజు కానుకగా అమిత్ షా 173 మంది దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లను పంపిణీ చేశారు. మోడీ నేతృత్వంలో భారత్ దూసుకుపోతోందని వివరించారు. 2014కు ముందు 11వ స్థానంలో ఉన్న భారత్ ఐదో స్థానానికి చేరిందని తెలిపారు. జీ 20 సమావేశాల ద్వారా భారత్ సంస్కృతి విశ్వవ్యాప్తం చేశామని అమిత్ షా వెల్లడించారు.
భారత సైన్యం పోరాటంతోనే త్రివర్ణ పతకం ఎగిరింది… : కిషన్‌రెడ్డి
13 నెలలంతా దేశమంతా స్వాతంత్య్ర పండగ చేసుకుంటే.. ఇక్కడ రజాకార్లు.. ప్రజల మీద, రైతుల మీద పడి అనేక రకాల ఆకృత్యాలు చేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. 75 ఏళ్లు ఈ చరిత్రను గత పాలకులు తొక్కిపెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. భారత్ సైన్యం పోరాటంతోనే తెలంగాణ గడ్డపై త్రివర్ణ పతకం ఎగిరిందన్నారు. సెప్టెంబర్ 17న సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన ఉత్సవాలు జరపాలని ప్రధాని మోడీ నిర్ణయించడం సంతోషంగా ఉందన్నారు. సశస్త్ర సీమాబల్ ఉద్యోగుల కోసం ఇబ్రహీంపట్నంలో క్వార్టర్లకు భూమి పూజ, షోయబుల్లాఖాన్, రాంజీగోండ్ ర్లతో స్పెషల్ పోస్టల్ కవర్ విడుదల చేశామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సమరయోధులు, దివ్యాంగులు, వివిధ రంగాల ప్రముఖులు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.