సిటిబ్యూరోః ఇన్సూరెన్స్ కంపెనీల పేరు చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న ఢిల్లీకి చెందిన ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నలుగరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, 85మంది టెలీ కాలర్లకు నోటీసులు జారీ చేశారు. నిందితుల వద్ద నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు, 40 మొబైల్ ఫోన్లు, మూడు వాకీటాకీలు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. జాయింట్ సిపి గజారావు భూపాల్ ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రామేంద్ర కుమార్, సునీల్, రిషబ్ తివారి, కావి ప్రకాష్ నలుగురు కలిసి హెచ్‌డబ్లూ అవుట్ సోర్సింగ్ అండ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఢిల్లీలో కార్యాలయం ఓపెన్ చేశారు. పిఎన్‌బి, మెట్‌లైఫ్ ఇన్సూరెన్స్, భారతి అక్సా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ పేరు చెప్పి కస్టమర్లకు ఫోన్లు చేస్తున్నారు. దీనికి గానే 85మంది టెలీ కాలర్లను పెట్టుకుని వారితో ఫోన్లు చేసి మాట్లాడిస్తున్నారు.
ఈ క్రమంలోనే నగరానికి చెందిన బాధితుడికి ఫోన్ చేసి మాయమాటలు చెప్పడంతో రూ.45.78లక్షలు పంపించడంతో మోసం చేశారు. పై కంపెనీల్లో ఇన్సూరెన్స్ చేసి వారి వివరాలు తెలుసుకుని వారికి ఫోన్లు చేసి తమ బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తే భారీగా వడ్డీ ఇస్తామని చెప్పి నమ్మిస్తున్నారు. వీరి మాటలు నమ్మిన వారి నుంచి మోసగాళ్ల బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేయిస్తున్నారు. కొందరికి ముందుగానే పాలసీని మ్యాచూరిటీ చేయించుకుంటే భారీగా డబ్బులు ఇస్తామని చెప్పి వారి నుంచి వివరాలు తెలుసుకుని డబ్బులను తమ బ్యాంకు ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. ఇన్స్‌స్పెక్టర్ ప్రసాదరావు, పిసిలు సతీష్, మురళికృష్ణ, సాయినాథ్, నవీన్‌కుమార్, భాస్కర్ తదితరులు పట్టుకున్నారు.