Monday, January 20, 2025

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ముగిసిన వాదనలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పును ఎపి హైకోర్టు మంగళవారం రిజర్వ్ చేసింది. ఎపి స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్ ను కొట్టివేయాలని, రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబునాయుడు పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుండి వాదనలు సాగాయి. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్దార్థ్ లూథ్రాలు వాదనలు వినిపించగా, ఎపి సిఐడి తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. చంద్రబాబు అరెస్ట్ ప్రక్రియ నిబంధనలకు విరుద్దంగా జరిగిందని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. కానీ ఈ వాదనలను ఎపి సిఐడి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ తోసిపుచ్చారు. అన్ని సాక్ష్యాలను సేకరించిన తర్వాతే చంద్రబాబును అరెస్ట్ చేసినట్టుగా చెప్పారు.ఈ నెల 9వ తేదీన టిడిపి అధినేత చంద్రబాబును ఎపి సిఐడి అరెస్ట్ చేసిన విషయం విదితమే. మంగళవారం ఉదయం నుండి చంద్రబాబును సమర్ధిస్తూ చంద్రబాబు తరపు న్యాయవాదులు ఎపి హైకోర్టు ముందు తమ వాదనలు వినిపించారు. ఎపి స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా ఎంతమంది విద్యార్థులు ప్రయోజనం పొందారనే విషయాన్ని కూడ కోర్టుకు చంద్రబాబు లాయర్లు అందజేశారు. చంద్రబాబును అరెస్ట్ చేసే సమయంలో ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు లేని విషయాన్ని బాబు తరపు లాయర్లు ప్రస్తావించారు. నిబంధనలకు విరుద్దంగా చంద్రబాబును అరెస్ట్ చేశారని వాదించారు. అయితే ఈ వాదనలను ఎపి సిఐడి తరపు న్యాయవాది తోసిపుచ్చారు. నిబంధనలకు విరుద్దంగా ఎపి స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారం సాగిందని ముకుల్ రోహత్గీ, పొన్నవోలు సుధాకర్ రెడ్డిలు వాదించారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇరు వర్గాలు వాదనలు కోర్టు విన్నది . అయితే తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది. ఇదిలా ఉంటే చంద్రబాబు కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్‌పై విచారణను ఎసిబి కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.

చంద్రబాబుపై ఎసిబి కోర్టులో మరో కేసులో పిటి వారెంట్ దాఖలు
టిడిపి అధినేత చంద్రబాబుపై మరో కేసులో పిటి వారెంట్ దాఖలైంది. విజయవాడ ఎసిబి కోర్టులో టిడిపి అధినేతపై సిఐడి పిటి వారెంట్ దాఖలు చేసింది. ఫైబర్ నెట్ కేసులో నిందితుడిగా పేర్కొంటూ పిటి వారెంట్ జారీ చేసింది. టిడిపి హయాంలో నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్ కంపెనీకి ఫైబర్ నెట్ కాంట్రాక్ట్ ఇచ్చారనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో రూ.121 కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఆరోపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని విచారించింది. 2021లో ఫైబర్‌నెట్ కుంభకోణంపై 19 మందిపై సిఐడి కేసు నమోదైంది. నాటి ఎఫ్‌ఐఆర్‌లో ఎ1గా వేమూరి హరిప్రసాద్, ఎ2గా మాజీ ఎంపి సాంబశివరావు ఉన్నారు. చంద్రబాబుపై ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పిటి వారెంట్ ఉంది. మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ఇప్పటికే చంద్రబాబు అరెస్టై రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News