న్యూఢిల్లీ : రైళ్లలో చిన్నారుల ప్రయాణానికి సంబంధించిన సవరించిన నిబంధనల కారణంగా భారతీయ రైల్వేకు రూ.2800 కోట్ల అదనపు ఆదాయం లభించింది. సవరించిన నిబంధనలు అమల్లోకి వచ్చి ఏడేళ్లు కాగా, 202223 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ. 560 కోట్లు వచ్చినట్టు రైల్వేశాఖ పేర్కొంది. ఈమేరకు ఆర్‌టీఐ దరఖాస్తుకు రైల్వేశాఖ పరిధి లోని సెంటర్ ఫర్ రైల్వే ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్స్ సమాచారం ఇచ్చింది.
రైళ్లలో ఒకప్పుడు 512 ఏళ్ల చిన్నారులకు సపరేట్ బెర్త్ ఎంచుకున్నా టికెట్ ధరలో సగం మాత్రమే వసూలు చేసేవారు. 2016 మార్చి 31న కొత్త నిబంధనలను రైల్వేశాఖ ప్రకటించింది. సపరేట్ బెర్త్ / సీటు ఎంచుకుంటే పెద్దల్లానే పూర్తి టికెట్ ధర వర్తిస్తుందని తెలిపింది. ఒక వేళ సెపరేట్ బెర్త్ వద్దనుకుంటే హాఫ్ టికెట్ వర్తిస్తుంది. ఈ నిబంధనలు 2016 ఏప్రిల్ 21 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో 201617 నుంచి 202223 వరకు వేర్వేరు ఆర్థిక సంవత్సరాల్లో రైల్వేశాఖకు ఎంత మొత్తం ఆదాయం సమకూరిందీ ఆర్‌టీఐ దరఖాస్తుకు రైల్వేశాఖ సమాధానం ఇచ్చింది.
గడిచిన ఏడేళ్లలో ఫుల్‌ఫేర్ చెల్లించి సపరేట్ బెర్త్ / సీట్‌ను వినియోగించుకుని 10 కోట్ల మంది చిన్నారులు ప్రయాణించినట్టు రైల్వేశాఖ తెలిపింది. 3.6 కోట్ల మంది మాత్రమే హాఫ్ టికెట్ ధర చెల్లించినట్టు పేర్కొంది. అంటే రైళ్లలో ప్రయాణించే చిన్నారుల్లో 70 శాతం మంది ఫుల్ టికెట్ చెల్లించే ప్రయాణిస్తున్నట్టు వెల్లడైందని ఆర్‌టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ పేర్కొన్నారు. దూర ప్రయాణాలు చేసే వారు సపరేట్ బెర్త్ వినియోగించుకుంటున్నారని , దీనివల్ల రైల్వేకు అదనపు ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు.