Monday, December 23, 2024

వచ్చే నెలలో శాసనసభ ఎన్నికల షెడ్యూల్.. !

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివరిలో జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఎన్నికల సంఘం తన కార్యకలాపాలు వేగవంతం చేసింది. పార్లమెంట్ సమావేశాల వరకు జమిలీ ఎన్నికలు జరుగుతాయని ప్రచారం.. కొంత గందరగోళానికి దారితీసింది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం తరపున రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకు ప్రత్యేక బృందం వచ్చే నెలలో పర్యటించనుంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది. పోలీసు బందోబస్తు వంటి పలు అంశాలను పరిశీలిం తనుంది. ఈ పరిశీలన పూర్తయిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేక నివేదికను సమర్పించనున్నది. ఆ నివేదిక అందిన వెంటనే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని వివిధ పార్టీల ప్రతినిధులు భావిస్తున్నారు. రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు అక్టోబరు రెండో వారంలో షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. పార్ల మెంట్. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు విడివిడిగా జరుగుతాయని ఇప్పటికే స్పష్టమైంది.

జనవరి 17లోగా కొత్త శాసనసభ కొలువు…
ప్రస్తుత శాసనసభ గడువు ముగిసేలోపే ఎన్నికల ప్రక్రియ పూర్తవాలి అంటే 2018లో డిసెంబరు 7న ఎన్నికలు జరిగాయి. జనవరి 16న శాసనసభ తొలి సమావేశం జరిగింది. దీన్ని బట్టి, 2024 జనవరి 17లోపు కొత్త శాసనసభ కొలువుదీరాలి. అందుకు అనుగుణంగా ఈ ఏడాది అక్టోబరు నెలలో షెడ్యూల్ విడుదలవ్వాలి ఆ తర్వాత, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ఉపసంహరణ, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలకు కనీసం రెండు నెలల సమయం అవసరం. ఇటీవలే మంత్రి కెటిఆర్ కూడా ‘అక్టోబరు పదో తేదీ లోపు షెడ్యూల్ విడుదలవ్వాలి. అంతకు మించి ఆలస్యం జరిగితే.. ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తుతాయి‘ అంటూ .. ఎక్స్ వేదికగా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అక్టోబరులోనే షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలున్నట్లు స్పష్టమవుతుంది. అదే విధంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని భావించిన బిఆర్‌ఎస్ పార్టీ 115 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది.

ఆ తర్వాతే రకరకాల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్, బిజెపి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించాయి. కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు దాదాపు వెయ్యి మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. బిజెపి నుంచి పోటీకి ఆరు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ క్రమంలోనే జమిలీ ఎన్నికల కోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం కమిటీ వేసింది. కమిటీ తొలి సమావేశం సైతం జరిగింది. దీంతో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం కాకుండా ఏప్రిల్ లో పార్లమెంటు ఎన్నికలతోపాటు జరుగుతాయనే చర్చ మొదలైంది. ఆ తర్వాత కేంద్రం మహిళా బిల్లును ప్రవేశపెట్టడంతో రిజర్వేషన్లు ఖరారు చేశాక ఎన్నికలు నిర్వహిస్తారని, ఈ క్రమంలో ఆరు నెలల వరకు జాప్యం జరగొచ్చనే మరో చర్చ తెరమీదకు వచ్చింది. దీనికి కేంద్రం వెంటనే తెరదించింది. 2029లోనే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని తెలిపింది.

 క్రియాశీలకంగా పార్టీల కార్యకలపాలు..
ఈ నెల 17న జరిగిన తెలంగాణ సమైఖ్యత, విమోచన, విలీనోత్సవాల పేరిట రాజకీయ పార్టీలు మళ్లీ క్రియాశీలకంగా ప్రజల్లోకి వెళ్లాయి. పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. అటకెక్కించిన దరఖాస్తులను పరిశీలించే పనిలో నిమగ్నమయ్యాయి. వారం పది రోజుల్లో తొలి జాబితాలను విడుల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ లో ఎన్నికలు నిర్వహించాలంటే అక్టోబర్ లో నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం అక్టోబర్ 3వ తేదీ నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షించడంతోపాటు రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. అక్టోబర్ 3వ తేదీన జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రాజకీయ పార్టీల నేతలతో సమావేశమై ఎన్నికల నిర్వహణాపరమైన అంశాలపై చర్చించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News