Monday, December 23, 2024

డ్రగ్స్‌కేసులో హీరో నవదీప్‌కు షాక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : డ్రగ్స్ కథా చిత్రంలో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. మరోమారు టాలీవుడ్ ఉలిక్కిపడేలా మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఆసక్తికర విషయాలు, పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హీరో నవదీప్‌కు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఈ కేసులో ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని నార్కోటిక్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు నవదీప్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ నార్కోటిక్ విభాగం పోలీసులు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన డ్రగ్స్ సరఫరా చేసే రాంచందర్‌తో నవదీప్‌కు సంబంధాలున్నాయని దాని తాలుకు వాట్సాప్ చాటింగ్ ఆధారాలు సేకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. సంబంధిత వాట్సాప్ చాటింగ్ ఆధారాలను హైకోర్టుకు సమర్పించిన కౌంటర్‌లో పొందుపర్చారు. గతం లోనూ నవదీప్‌పై డ్రగ్స్ కేసులున్నాయని తెలిపారు. మరోవైపు మాదాపూర్ డ్రగ్స్ కేసుతో నవదీప్‌కు ఎటువంటి సంబంధం లేదని, గతంలో ఉన్న డ్రగ్స్ కేసుల్లో నిందితుడిగా లేడని నవదీప్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

ఇరువురి వాదనలను విన్న కోర్టు 41ఎ కింద నవదీప్‌కు నోటీసులు ఇచ్చి విచారించాలని నార్కోటిక్ పోలీసులను ఆదేశించింది. నవదీప్‌కు 41ఎ నోటీసులు జారీ చేసి అతనిని పిలిచి ప్రశ్నించనున్నారు. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన నార్కోటిక్ విభాగం పోలీసులు నవదీప్ ను ప్రశ్నించి అతని నుంచి కీలక సమాచారం సేకరించాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఒక్కొక్కటిగా చీకటి కోణాలు వెలుగుచూస్తున్నాయి. పట్టుబడ్డ నిందితులు మత్తుదందాలను అడ్డుపెట్టుకుని చిత్రనిర్మాతలుగా అవతారం ఎత్తారని పోలీసుల విచారణలో తేలింది. నైజీరియన్ల నుంచి మాదకద్రవ్యాలను కొనుగోలు చేసి, రేవ్ పార్టీల వంటి కార్యక్రమాలకు తెరలేపుతున్నారని గుర్తించారు. వీటికి సినీ, రాజకీయ మిత్రులను ఆహ్వానించి, వారితో పరిచయాలు పెంచుకుంటున్నారని తెలిపారు. నిందితులు కల్హర్‌రెడ్డి, బాలాజీ, రాంకిశోర్ సెల్‌ఫోన్ల డేటాలో పలువురు సినీ రంగ ప్రముఖుల ఫోన్ నంబర్లను పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. తెలిసిన సమాచారం మేరకు సినీ నిర్మాతలు వెంకటరత్నారెడ్డి, రవి ఉప్పలపాటిలకు విశాఖపట్నానికి చెందిన రాంకిశోర్, నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ నేవీ ఉద్యోగి బాలాజీ ద్వారా డ్రగ్స్ చేరేవని తెలుస్తోంది.

బెంగళూరులోని డ్రగ్స్ సరఫరా చేసే నైజీరియన్ల ముఠాతో బాలాజీకి పరిచయాలున్నాయి. అక్కడి నుంచి హెరాయిన్, కొకైన్, ఎల్‌ఎస్‌డీ బ్లాట్లు తీసుకొచ్చేందుకు రాంకిశోర్ సహకరించేవాడు. డ్రగ్స్‌ను బెంగళూరులో ఉంటున్న నైజీరియన్ల నుంచి కొనుగోలు చేసి, రాష్ట్రంలో సినీ, రాజకీయ ప్రముఖులకు విక్రయించేవారు. గచ్చిబౌలి, మాదాపూర్‌లోని విలాసవంతమైన అపార్టుమెంట్లను అద్దెకు తీసుకుని రేవ్‌పార్టీలు నిర్వహించేవారు. మోడళ్లు, సినీ అవకాశాల కోసం ఎదురుచూసే యువతులకు మాదకద్రవ్యాలు ఎరవేసి రప్పించేవారు. ఇంకోవైపు నగరంలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేసేందుకు ఇటీవల అరెస్టయిన 8 మంది నిందితులకు పోలీసు కస్టడీ కోరుతూ మంగళవారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. మురళీ వెంకట రత్నారెడ్డి, భాస్కర్ లను అరెస్ట్ చేసినప్పుడు బయటపడిన సమాచారంతో ఈ నెల 14న ముగ్గురు నైజీరియన్లు సహా మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్‌రావు, రాంచంద్, సుశాంత్‌రెడ్డి, కె.సందీప్, శ్రీకర్ కృష్ణప్రసాద్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పోలీసులు తరలించారు. వీరి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు 7 రోజులు కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దఖలు పర్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News