మదురై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై తన విమరల తీవ్రతకు మరింత పదును పెట్టారు. బుధవారం నాడిక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొన్న డిఎంకె యువజన విభాగం నాయకుడు ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి కాని ఇప్పుడు అక్కడ జరగుతున్న తొలి పార్లమెంట్ సమావేశాలకు కాని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. ఎందుకంటే ఆమె వితంతువు కావడంతోపాటు గిరిజన మహిళ కావడమేనని ఆయన ఆరోపించారు. దీన్నే సనాతన ధర్మం అంటారంటూ ఆయన వ్యాఖ్యానించారు.
సనాతన ధర్మంపై గతంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై బిజెపి, ఇతర హిందూత్వ సంస్థలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి.
కొత్తి నెలల క్రితం జరిగిన కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి కాని ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన ఐదురోజుల మొదటి సపార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కాని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రభుత్వం నుంచి ఆహ్వానం లేదని ఉదయనిధి తెలిపారు.
మన దేశ ప్రథమ పౌరురాలు ఎవరు..రాష్ట్రపతి..ఆమె పేరు ద్రౌపది ముర్ము. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ఆమెను ఆహ్వానించలేదు. దీన్నే సనాతన ధర్మం అంటారు అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
నిన్ననే ఒక హిందీ సినీ నటిని దగ్గరుండి మరీ కొత్త పార్లమెంట్ భవనానికి తీసుకెళ్లారు. కాని రాష్ట్రపతికి మాత్రం అనుమతి ఉండదు. ఎందుకంటే ద్రౌపది ముర్ము ఒక గిరిజన తెగకు చెందిన మహిళ. ఆమెకు భర్త లేడు. ఇదే సనాతన ధర్మమని అంటామా అంటూ ఆయన ప్రశ్నించారు.