ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది జనవరిలో (2024)లో జరుగుతాయి. ఈ విషయాన్ని పాకిస్థాన్‌లోని ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. ఆర్థిక సంక్షోభం, సంబంధిత నగదు కొరత ఇతరత్రా ఇక్కట్లతో పాకిస్థాన్ సతమతమవుతోంది. ఈ దశలోనే దేశంలో పార్లమెంట్ ఎన్నికలు సకాలంలో నిర్వహించాలని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికలకు ఏర్పాట్లు చేపట్టినట్లు, ఇప్పుడు డిలిమిటేషన్ ప్రక్రియ సాగుతున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. జనవరిలో జనరల్ ఎలక్షన్స్ ఉంటాయని వెల్లడించింది. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించు కుంటున్నారు.
పునర్విభజిత నియోజకవర్గాల ప్రాధమిక జాబితాలను ఈ నెల 27వ తేదీననే వెలువరిస్తారు. దేశంలోని జాతీయ అసెంబ్లీని ఆగస్టు 9వ తేదీన రద్దు చేశారు. రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ రద్దు తరువాత 90 రోజులలో తిరిగి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఓటర్ల, నియోజకవర్గాల జాబితాల సవరణ ఇతరత్రా ప్రక్రియలతో ఎన్నికల సంఘం ఈ గడువులోగా ఎన్నికలు నిర్వహించలేని స్థితిలో ఉంది. ఇప్పుడు ఈ ఏడాదే పాకిస్థాన్‌లో తాజాగా జనాభా లెక్కల ప్రక్రియ జరిగింది. ఈ నేపథ్యంలో దేశంలో ఎన్నికలకు మార్గం సుగమం అయింది. అయితే ఇమ్రాన్‌ఖాన్ జైలు నిర్బంధం, పలు ప్రాంతాలలో నెలకొని ఉన్న క్లిష్టతలు, అశాంతి నడుమ ఎన్నికల నిర్వహణ సవాలుగా మారనుంది.