Friday, November 15, 2024

వైద్యుడి పేరుతో మోసం..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః మ్యాట్రిమోని వెబ్ సైట్లలో నుంచి యువతులు, మహిళల వివరాలు సేకరిస్తూ నైజీరియన్లు మోసం చేస్తున్నారు. గతంలో జాబ్ ఫ్రాడ్, సైబర్ నేరాలను చేసే ముఠాలు ఇప్పుడు రూట్‌మార్చి వివాహం చేసుకుంటామని చెప్పి పలువురు బాధితుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ మోసం చేస్తున్నారు. యువతులు తమకు కావాల్సిన వరుడి కోసం వివాహానికి సంబంధించిన వెబ్ సైట్లలో ప్రొఫైల్స్‌ను అప్‌లోడ్ చేస్తున్నారు. ఇండియాకు అక్రమంగా వచ్చి ఇక్కడే ఉంటున్న నైజీరియన్లు దానిని తమ సంపాదనకు ఉపయోగించుకుంటున్నారు. షాదీడాట్.కామ్, భారత్‌మ్యాట్రిమోని తదితర వివాహ వెబ్‌సైట్లలో ఉన్న యువతులు, మహిళలు, భర్తతో విడాకులు తీసుకుని రెండు వివాహం చేసుకోవాలనుకునే వారి వివరాలు తీసుకుంటున్నారు. వారి వివరాల ఆధారంగా మొబైల్ నంబర్ తీసుకుని తాను అమెరికాలో వైద్యుడిగా పనిచేస్తున్నానని చెప్పి నకిలీ ప్రొఫైల్స్ పెట్టి వారిని మోసం చేస్తున్నారు. ఈ విధంగా కొద్ది రోజులు వాట్సాప్‌లో ఛాటింగ్ చేసుకున్న తర్వాత వివాహం చేసుకుంటానని చెబుతున్నారు.

ఇది నమ్మి పలువురు బాధితులు వారి మాటలు నమ్మి మోసపోతున్నారు. తాను విదేశాల్లో వైద్యుడిగా పనిచేస్తున్నానని, ఇండియాకు వచ్చిన తర్వాత వివాహం చేసుకుంటానని చెబుతున్నారు. కొద్ది రోజుల తర్వాత డాలర్లు, బంగారు ఆభరణాలు, ఆపిల్ వస్తువులు పంపిస్తున్నానని చెబుతున్నారు. కొరియర్ ద్వారా వస్తువులు పంపిస్తున్నానని చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల తర్వాత కొరియర్ నుంచి ఫోన్ చేసినట్లు వేరే వారితో మాట్లాడిస్తున్నారు. మీకు కొరియర్ వచ్చిందని, కస్టమ్స్, జిఎస్‌టి తదితర ట్యాక్స్‌లు చెల్లించాలని వాటి కింద డబ్బులు చెల్లించాలని చెప్పడంతో బాధితులు లక్షలాది రూపాయలు చెల్లిస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి కస్టమ్స్ క్లియరెన్స్ డబ్బులు ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేస్తే వస్తువులు పంపిస్తామని చెప్పడంతో డబ్బులు పంపిస్తున్నారు. ఇలా పలు కారణాలు చెప్పి దశల వారీగా డబ్బులు తీసుకుంటున్నారు. చివరికి తాను మోసపోయానని పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

వైద్యుల పేరుతో మోసం…
వివాహం చేసుకుంటానని చెబుతూ మోసం చేస్తున్న నైజీరియన్లు ఎక్కువగా వైద్యుడిగా పనిచేస్తున్నానని బాధితులను మోసం చేస్తున్నారు. వైద్య వృత్తికి మంచి ఆదరణ ఉండడంతో సులభంగా నమ్మి మోసపోతున్నారు. అంతేకాకుండా నైజీరియన్లు ఇంగ్లీష్ బాగా వచ్చిన వారితో చాటింగ్ చేయిస్తున్నారు. కూకట్‌పల్లికి చెందిన వైద్యురాలు భర్త నుంచి విడాకులు తీసుకుని వేరే ఉంటోంది. రెండో వివాహం చేసుకుందామని భారత్‌మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో తన వివరాలు పొందుపర్చింది. వాటిని చూసిని నైజీరియన్ ముఠా ఆమెకు ఖరీదైన వస్తువులు పంపిస్తున్నానని చెప్పి రెండు దఫాలుగా రూ.12,45,000 వసూలు చేశాడు. బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి గుట్టు రట్టయింది. నైజీరియాకు చెందిన అబెల్ ఓడారా ఇండియాకు విజిటింగ్ వీసాపై వచ్చి ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉంటున్నాడు. షాదీ.కామ్‌లో డాక్టర్ ఆయూష్ త్యాగిగా ప్రొఫైల్ అప్‌లోడ్ చేసి రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఓ మహిళతో ఛాటింగ్ చేశాడు.

తాను లండన్‌లో వైద్యుడిగా పనిచేస్తున్నానని, తనకు కూతురు ఉందని, భార్య కారుప్రమాదంలో మృతిచెందిందని తెలిపాడు. తను ఇండియాకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపాడు. కొద్ది రోజుల తర్వాత ఓ నంబర్ నుంచి బాధితురాలికి ఫోన్ వచ్చింది. తన పేరు పూజ అన్ని కస్టమ్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నానని చెప్పింది. ఆయూష్ త్యాగి తమ కస్టడీలో ఉన్నాడని రూ.3 కోట్లు చెల్లిస్తే విడుదల చేస్తామని చెప్పారు. ఇది నిజమని నమ్మిన బాధితురాలు వివిధ బ్యాంకుల ద్వారా రూ.5,45,100 డిపాజిట్ చేసింది. కొద్ది రోజుల తర్వాత తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్టు చేశారు. సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువతి మ్యాట్రీమోని వెబ్‌సైట్‌లో తన వివరాలు పెట్టింది. వాటిని చూసిన నైజీరియాకు చెందిన ఇలా పలువురిని వివాహం చేసుకుంటానని చెప్పి నైజీరియాకు చెందిన అలెక్స్ మార్క్ ఓడుడు బాధితురాలికి ఫోన్ చేశాడు. తాను అమెరికాలో కార్డియాక్ సర్జన్‌గా పనిచేస్తున్నానని చెప్పాడు.

వివాహం చేసుకునేందుకు ఆసక్తి ఉందని చెప్పడంతో ఇద్దరు కొద్ది రోజులు వాట్సాప్‌లో ఛాటింగ్ చేసుకున్నారు. తాను ఉంటున్న ప్రాంతంలో టెర్రరిస్ట్‌లు దాడి చేశారని, తన బ్యాంక్ ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారని చెప్పాడు. తనకు అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నాయని, ఇండియాకు రాగానే ఇస్తానని చెప్పాడు. ఇది నమ్మిన బాధితురాలు నిందితుడికి 27.14లక్షల రూపాయలు పంపించింది. డబ్బులు అందినప్పటి నుంచి నిందితుడు స్పందించడం మానివేశాడు. అనుమానం వచ్చిన బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు ముంబాయికి దుస్తుల వ్యాపారం చేసేందుకు నైజీరియా నుంచి వచ్చిన అలెక్స్ సైబర్ నేరాలు చేస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News