మనతెలంగాణ/ హైదరాబాద్ : అటవీ సంరక్షణ చట్టంలో ఉన్న అస్పష్టతలను తొలగించి వివిధ రకాల భూముల విషయంలో చట్టం వర్తింపజేసేలా సవరణ జరిగిందని కేంద్ర అడవులు, పర్యావరణం శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ రమేశ్ పాండే అన్నారు. శుక్రవారం దూలపల్లి అటవీ అకాడమీలో అటవీ జీవవైవిధ్య సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. అటవీ సంరక్షణ, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ది కార్యక్రమాల మధ్య సమతూకాన్ని పాటించాలని అన్నారు.
అటవీ సంరక్షణ చట్టం అమలులో తలెత్తే సమస్యలకు ఈ సదస్సు పరిష్కారాలను సూచిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలోని వివిధ తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల అధికారులు ఆన్‌లైన్‌లో సదస్సులో పాల్గొన్నారు. సమావేశంలో జీవవైవిధ్య సంస్థ సంచాలకులు వెంకట్ రెడ్డి, రాష్ట్ర అటవీదళాల అధిపతి ఆర్.ఎమ్. డోబ్రియాల్, పి.సుబ్రహ్మణ్యం, డి.వి.ఎన్.మూర్తి, వినీత్, ఎం.కె. శంభు, సందీప్ ప్రాటీ పాల్గొన్నారు.