కోనరావుపేట: శివంగలపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో రైతులకు చిరుత పిల్లలు కనిపించడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగలల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో చిరుత పిల్ల రైతులకు కనబడడంతో గ్రామంలోకి వచ్చి గ్రామస్తులకు తెలియజేయడంతో ఒక్కసారి అందరు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్థుల సమాచారంతో సిరిసిల్ల రేంజ్ అధికారి శ్రీనివాసరావు, సెక్షన్ అధికారి బాపురాజు వారి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అయితే ఈ పిల్ల చిరుతకు పుట్టినదేనని తేల్చిచెప్పారు. దీనిని తీసుకెళ్లడానికి మళ్లీ చిరుత ఇక్కడకు వస్తుందని
ఆ సమయంలో ఎవరైనా ఇక్కడ ఉంటే దాడి చేసే ప్రమాదముందని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చిరుత పిల్లను దాని తల్లి దగ్గరకు చేరు ఆపరేషన్ చేపట్టామని దీనికి సహకరించాలని అధికారులు కోరారు. ఇదిలా ఉండగా సిరిసిల్ల అటవీశాఖతో పాటు వేములవాడ, చందుర్తి ప్రాంత అటవీశాఖ పరిధిలో కూడా చిరుత పులులు సంచరిస్తున్నాయి. అటవీ ప్రాంత శివారు ప్రాంతాలలో చిరుత దాడుల్లో గొర్రెల, మేకల, ఆవుల, జింక, దుప్పిలు మృత్యువాతపడుతున్నాయి. 3 నెలల క్రితం మరిమడ్ల ఘటన మరువక ముందే మళ్ళీ శివంగలల్లిలో చిరుతపులి పిల్ల కనిపించడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.