బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రభుత్వం సింగూరు ప్రాజెక్టుకు కుడి, ఎడమలైన బసవేశ్వర,సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కోరారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లాలో జరిగిన బహుజన శక్తి ప్రదర్శన సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సాగునీరు అందక వేలాది మంది ప్రజలు వలసలు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్,సంగారెడ్డి ప్రాంతాలకు సాగునీరు అందించే బసవేశ్వర, సంగమేశ్వర త్వరగా నిర్మాణం చేపట్టాలన్నారు.
అందోల్ నియోజవర్గంలో కనీసం రోడ్లు, విద్య,వైద్య సదుపాయాలు సక్రమంగా లేవని జర్నలిస్టునని చెప్పుకునే స్థానిక ఎమ్మెల్యే జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నా స్పందించడం లేదన్నారు. జనాభాలో మెజారిటీ ప్రజలకు రాజ్యాధికారం దక్కడమే తమ పార్టీ లక్ష్యమన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరణం నాయిని ఈశ్వర్, ప్రేమ్ కుమార్,మోహన్,జిల్లా అధ్యక్షులు నటరాజ్,ప్రధాన కార్యదర్శి మల్లేశ్ గౌడ్,అసెంబ్లీ ఇంచార్జ్ ముప్పారపు ప్రకాష్,ఈశ్వర్,జనార్దన్,పల్లవి తదితరులు పాల్గొన్నారు.