న్యూఢిల్లీ : ఈనెల 9,10 తేదీల్లో జీ 20 సదస్సు నిర్వహణలో తమ అనుభవాలను అధికారులు డాక్యుమెంట్ చేయాలని ప్రధాని మోడీ అధికారులకు సూచించారు. అలా డాక్యుమెంట్ చేయడం వల్ల భవిష్య కార్యక్రమాల నిర్వహణకు ఉపయోగపడతాయని ఆయన సూచించారు. అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ సదస్సు సందర్భంగా ఎదురైన సవాళ్లను పరిష్కరించడంలో అధికారులు చేసిన కృషిని మోడీ కొనియాడారు. జి20 సదస్సు విజయం క్రెడిట్ మీ అందరికీ దక్కుతుందని,
అందుకనే ఈ అనుభవాలు రికార్డు చేస్తే భవిష్యత్ కార్యక్రమాల నిర్వహణకు మార్గదర్శకాలుగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారో ప్రతివారు తమ స్వంత భాషలో రాయగలరని, ఆమేరకు 100 పేజీలు అవుతాయని, వాటిని భద్రపర్చాలని సూచించారు. క్షేత్రస్థాయి నుంచి సదస్సు నిర్వహణలో పాలుపంచుకున్న క్లీనర్లు, డ్రైవర్లు, వెయిటర్ల వరకు మొత్తం పాలుపంచుకున్నారు. ఈ విధంగా సదస్సు విజయంలో పాలుపంచుకున్న దాదాపు 3000 మందితో ప్రధాని మోడీ అనుసంధానం అయ్యారు.