Friday, November 1, 2024

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

- Advertisement -
- Advertisement -

రూ. 350 కోట్ల రూపాయలను పెట్టుబడి పెడుతున్న సింటెక్స్
అందుబాటులోకి రానున్న 1000 ఉద్యోగాలు
28న ప్లాంట్ శంఖుస్థాపన
పెట్టుబడిని ఆహ్వానించిన మంత్రి కెటిఆర్

మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది. సింటెక్స్ కంపెనీ రాష్ట్రంలో 350 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టనున్నది. వెల్ స్పన్ గ్రూప్ కంపెనీ భాగస్వామిగా ఉన్న సింటెక్స్ తన తయారీ యూనిట్ కోసం 350 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతున్నది. ఈ పెట్టుబడి ద్వారా సుమారు 1000 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. రంగారెడ్డి జిల్లా చందన్వల్లిలో సింటెక్స్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయబోతున్నది. ఈ తయారీ కేంద్రం నుంచి సింటెక్స్ వాటర్ ట్యాంకులను, ప్లాస్టిక్ పైపులను, ఆటో కాంపోనెంట్స్ , ఇతర పరికరాలను తయారు చేయబోతున్నది. ఈ కంపెనీ తయారీ ప్లాంట్ శంఖుస్థాపన కార్యక్రమం ఈ నెల 28 తేదీన జరగనున్నది. వెల్ స్పన్ కంపెనీ చైర్మన్ బికె గోయెంకా, మంత్రి కె.తారక రామారావు ఈ కార్యక్రమానికి హజరుకానున్నారు.ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టి విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వెల్ స్పన్ గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో మరింత విస్తరించనుడడం పట్ల మంత్రి కె. తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు.

వెల్ స్పన్ గ్రూప్ భాగస్వామిగా ఉన్న సింటెక్స్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో అదనంగా 350 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నందుకు కంపెనీకి ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన మౌలిక వసతుల వలన అనేక నూతన పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వస్తున్నాయని, అయితే ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు తమ కార్యకలాపాలను, తమ పెట్టుబడులను విస్తరించడాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా తెలుసుకున్నదని మంత్రి కెటిఆర్ తెలిపారు. అందులో భాగంగానే రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలకు అవసరమైన సహాయ సహకారాలను, మౌలిక వసతుల కల్పన సకాలంలో అందించడం వలన ఆయా కంపెనీలు భారీగా విస్తరిస్తున్నాయన్నారు. సింటెక్స్ కంపెనీ పెట్టుబడిని ఆహ్వానించిన మంత్రి కెటిఆర్, కంపెనీకి అన్ని రకాల సహాయసహకాలు అందిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే తమ వెల్ స్పన్ గ్రూప్ పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, ఇక్కడి వాతావరణం పెట్టుబడులకు అత్యంత అనుకూలంగా ఉందని, అందుకే తమ అద్వర్యంలోని సింటెక్స్ ద్వారా మరిన్ని పెట్టుబడులు పెడుతున్నామని తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News