ముంబై : “సింగం ’ సినిమా పోలీసు తరహా తక్షణ న్యాయం క్రమేపీ ప్రజలలో తప్పుడు, ప్రమాదకర సందేశాలకు దారితీస్తుందని బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి గౌతమ్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. నేరం జరిగినప్పుడు తగు విధమైన విచారణ జరగాల్సి ఉంటుంది. అయితే ప్రజల భావోద్వేగాలు వేరే విధంగా ఉంటాయి. వెంటనే నేర నిర్థారణ జరగకముందే సంబంధిత విషయంలో నిందితులను చంపేయాలనే ఆలోచనల్లో ఉంటారు.ఈ క్రమంలో సింగం తరహా వరుస బ్లాక్‌బస్టర్ సినిమాలతో సమాజంలో ముప్పు ఏర్పడుతుందని ఈ న్యాయమూర్తి తెలిపారు. సినిమాల్లోని హీరో పోలీసు దూకుడుగా వెళ్లుతుంటాడు.
చట్టం న్యాయం వంటివి పట్టించుకోకుండా అక్కడికక్కడ శిక్ష అంటూ సాగించే సినిమా చర్యలతో పరిస్థితి ఎటునుంచి ఎటు దారితీస్తుందని ప్రశ్నించారు. ప్రజలకు కూడా న్యాయవ్యవస్థల విచారణ తీరు పట్ల అసహనం ఉండటం సహజమే అన్నారు. నేరాలకు పాల్పడ్డారని కొన్ని చోట్ల పోలీసులు కాల్చిచంపిన ఘటనలు జరిగినప్పుడు జనం శభాష్ పోలీసు అంటుంటారు. కోర్టులకు వెళితే ఎప్పటికి న్యాయం జరుగుతుందని అనుకోవడం పరిపాటి అయిందని, ఇటువంటి భావనలు ప్రేరేపిస్తూ సింగం ఇతర సినిమాలు సీరిస్‌గా రావడం, వీటిని ప్రేరణగా తీసుకుని ప్రజలు ఇదే భావనలో మరింతగా కూరుకుపోవడం దారుణం అయిందని ఈ న్యాయమూర్తి ఇక్కడ జరిగిన ఓ న్యాయసదస్సులో తెలిపారు.