Monday, January 20, 2025

టిఎస్‌పిఎస్‌సి మళ్లీ ఫెయిల్

- Advertisement -
- Advertisement -

గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను రద్దు చేసిన హైకోర్టు

తిరిగి పరీక్ష నిర్వహించాలని సర్వీస్ కమిషన్‌కు ఆదేశం

బయోమెట్రిక్ తీసుకోలేదని హైకోర్టును ఆశ్రయించిన పలువురు అభ్యర్థులు

హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఒఎంఆర్ షీట్లు ఇచ్చారని ఫిర్యాదు

అభ్యర్థిని నిర్ధారించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కోర్టుకు నివేదించిన కమిషన్ లాయర్లు

సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్‌కు సిద్ధమవుతున్న టిఎస్‌పిఎస్‌సి

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని టిఎస్‌పిఎస్‌సిని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం శనివారం కీలక తీర్పు వెల్లడించింది. మొత్తం 503 గ్రూప్- 1 పోస్టుల భర్తీ కోసం గత ఏడాది టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ జారీ చేసి.. అక్టోబరు 16వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించడంతో పాటు ఫలితాలను కూడా వెల్లడించింది. అయితే గ్రూప్- 1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం లీకైనట్లు దర్యాప్తులో తేలడంతో అక్టోబరు 16న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి..ఈ ఏడాది జూన్ 11వ తేదీన తిరిగి నిర్వహించింది.

రాష్ట్రవ్యాప్తంగా 994 కేంద్రాల్లో రెండోసారి నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు 2,33,506 మంది హాజరయ్యారు.ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ ని విడుదల చేయడంతో పాటు అభ్యర్థుల ఒఎంఆర్ షీట్లనూ టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. అయితే పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని, హాల్ టికెట్ నంబర్ లేకుండా ఒఎంఆర్ షీట్లు ఇచ్చారని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పరీక్షను రద్దు చేయాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.అక్టోబరు 16న నిర్వహించిన పద్ధతిలోనే జూన్ 11న పరీక్ష జరపకపోవడం అనుమానాలకు తావిస్తోందని పిటిషనర్లు వాదించారు. నోటిఫికేషన్‌కు భిన్నంగా పరీక్ష నిర్వహించడం చట్ట విరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఎ.గిరిధర్ రావు, నర్సింగ్ వాదించారు.

యుపిఎస్‌సి అనుసరిస్తున్న విధానాన్నే పాటించామని అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్, టిఎస్‌పిఎస్‌సి న్యాయవాది రాంగోపాల్‌రావు వాదించారు. కొందరు అభ్యర్థులే హైకోర్టుకు వచ్చారని.. మిగతా లక్షల మంది అభ్యంతరం వ్యక్తం చేయలేదని అన్నారు. అభ్యర్థిని నిర్ధారించేందుకు.. అవకతవకలు జరగకుండా అనేక విధానాలు పాటించామని పే ర్కొంది. ఇరువైపుల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.మాధవీ దేవి శనివారం గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి, తిరిగి నిర్వహించాలని తీర్పు వెల్లడించారు. గ్రూప్-1 పరీక్ష మరోసారి రద్దు కావడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. పరీక్ష నిర్వహణలో టిఎస్‌పిఎస్‌సి సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదన్న అసహనం వ్యక్తమవుతోంది. మరోవైపు సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేసేందుకు టిఎస్‌పిఎస్‌సి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. తీర్పు ప్రతిని వెంటనే ఇవ్వాలని టిఎస్‌పిఎస్‌సి న్యాయవాది హైకోర్టును కోరారు. సోమ, హైకోర్టు డివిజన్ బెంచి వద్ద అప్పీలు చేసే అవకాశం ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News