Monday, December 23, 2024

కథలకు పట్టాభిషేకం

- Advertisement -
- Advertisement -

వ్యక్తిగత ధృక్కోణం కేంద్రంగా, వ్యక్తులు ప్రధానంగా ఉండే అవార్డుల్లా కాక ఒక సాహిత్య సమూహం, ఒక విస్తృత సాహిత్య ప్రయోజనాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని ఇచ్చే అవార్డుల అవసరం చాలా ఉందని భావించిన ఖమ్మం ఈస్తటిక్స్ సంస్థ పన్నెండు బహుమతుల కథలతో వెలువరించిన కథా సంకలనమే ఈస్తటిక్స్ కథలు 2022. ప్రతి వారం, ప్రతి నెలా వివిధ మ్యాగజైన్ లలో వచ్చే కథలకు, బహుమతి పొందిన కథలకు కొంత వ్యత్యాసం ఉంటుంది. అయితే ఈ రెండింటిలో ఏది ఉత్తమం? దేన్ని చదవాలి? అనే విషయానికొస్తే రెండూ చదవాలి. ఒక్కో కథ మేథావులైన ఎడిటర్ ద్వారానో, న్యాయ నిర్ణేత ద్వారానే ‘ఈ కథ సమాజ హితాన్ని కోరుతుంది’ అనే ముద్రనే వేయించుకుని ప్రచురించబడుతుంది కాబట్టి రెండింటికీ సమన్యాయం ఉంటుంది. అయితే చాలామంది పాఠకులు బహుమతి కథలపై మరింత ఆసక్తిని ప్రదర్శిస్తారు. ఎందరో అభిప్రాయాల్ని ఒక తాటికి తీసుకొచ్చి ‘మంచి కథ’ అని ముద్ర వేయించుకుంటుందని ఏరికోరి వాటిని చదువుతారు. అందుకే అలాంటి సంకలనాల్లో తమ కథ కూడా ఉంటే నలుగురికి చేరువవ్వుతామని, తమ ఆకాంక్ష నలుగురికి చేరుతుందని కథకులూ ఆసక్తి చూపిస్తారు. మేధోమథనం జరుపుతారు.

సమస్యల్ని దృష్టికి తీసుకొస్తారు. అటువంటి కొన్ని సమస్యలే ఈ సంకలనంలో అందలమెక్కి కూర్చున్నాయి. ఆ ముస్లీం కుటుంబం హిందువుల కుటుంబాల మధ్యలోనే జీవించింది. అతనికి దేవుడంటే నమ్మకం లేదు. నమాజ్ చేయడు. కానీ ముంతాజ్ మాత్రం ముస్లీం సంప్రదాయాలు పాటిస్తుంది. ఒకరోజు ఆమె ఆ హిందువుల కుటుంబాల మధ్యనుంచి ముస్లీం కుటుంబాలున్న ఏరియాకి మారిపోదాం అంటుంది. రేపు చనిపోయాక ముస్లీం పద్ధతి ప్రకారమే జరగాలనే అదే కమ్యూనిటీలో ఉండాలంటుంది. అదే ఆమె చివరి కోరిక అని కూడా చెప్తుంది. సరేనని ఆ ఇల్లు అమ్మేసి ముస్లీం కమ్యూనిటీలో ఇల్లు కొనుక్కుని వెళ్తారు. ముంతాజ్ కి బ్రూనో (కుక్కపిల్ల) అంటే ఎంతో ఇష్టం. సొంత కొడుకులా చూసుకుంటుంది. కానీ ముస్లీం కుటుంబ సంప్రదాయం ప్రకారం కుక్కల్ని పెంచుకోవడం హరాం (నేరం). ఆ సంగతి వాళ్లకి కూడా తెలీదు. రోజూ ఇంట్లో మొరుగుతున్న బ్రోనో గురించి మత పెద్దలు వచ్చి హెచ్చరిస్తారు. నమాజ్ చదివేటప్పుడు అపవిత్రం అవుతుందని గోల చేస్తారు.

గోడవులవుతాయి. ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపొమ్మంటారు. ‘మతం మాదక ద్రవ్యాలకన్నా ప్రమాదకరమైంది. వాళ్ళను రెచ్చగొట్టకుండా బుజ్జగించడమే మేలని అతను మౌనం వహిస్తాడు. వాళ్ళపై కక్ష పెంచుకున్న మత పెద్దలు ఒకరోజు వాళ్ళు లేనప్పుడు బ్రూనోను రక్తం వచ్చేలా కొడతారు. అప్పుడు ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలియాలంటే ‘సయ్యద్ సలీం’ రచించిన హరామీ కథను చదవాల్సిందే! మతం ముసుగులో మూగజీవాల్ని హింసించడం ఎంతటి నేరమో తెలుస్తుంది.ఇప్పటికీ పల్లెటూళ్ళు వెళ్లి చూడండి. ప్రకృతి ఎంత సహజ సిద్ధంగా గోచరిస్తుందో… ప్రతి ఇంటి ముందున్న చెట్టుమీద ఎన్నో పక్షులు కిలకిల రావాలతో ఇంపైన సంగీతాన్ని వినిపిస్తాయి. అక్కడే తింటాయి. అక్కడే తిరుగుతాయి. అక్కడే గూడు కట్టుకుంటాయి.కాంక్రీట్ జంగిల్స్ వచ్చాక చెట్లూ లేవు, వాటి మీద పక్షులూ లేవు. పొరపాటున ఏదైనా పక్షి అటుగా వచ్చిందంటే నీడ లేక తిరోగమనం చేయాల్సిందే! కానీ భాగ్యనగరంలాంటి నగరాల్లో పావురాలు తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నాయి.

కూటికోసం అవి పడే తిప్పలు చూస్తుంటే గుండె బరువెక్కిపోతుంది. అలాంటి పక్షులు అపార్ట్ మెంట్ లోకి చొరబడితే తరిమేస్తున్నారు.ఒకప్పుడు పక్షులను పట్టుకోవడానికి వలను వాడేవాళ్ళు. కానిప్పుడు అవే పక్షుల నుంచి రక్షణ కోసం మనకు మనమే ఎందుకు వలేసుకుంటున్నామంటూ ప్రశ్నిస్తుంది ‘దేశరాజు’ రచించిన సహజాసహజం అనే కథ.తెలుగు భాష చచ్చిపోతుందని గగ్గోలు పెడుతున్న చాలామంది కుటుంబాల్లోని భవిష్యత్ తరం చదివేది ఏ మీడియంలో అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పైన పటారం లోన లొటారం. చేయడానికి ప్రభుత్వ ఉద్యోగం కావాలి. అందులో తమ పిల్లల్ని చదివించడానికి మాత్రం ససేమీరా ఒప్పుకోరు. ఇక ప్రైవేటు ఉద్యోగాలు చేసేవాళ్ళు, బిజినెస్ లు చేసేవాళ్ళు, తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో ఎందుకు చదివిస్తారు?తాను అలాంటివాడిని కాదంటున్నాడు సౌమిత్ర. తాను అలాంటి ప్రభుత్వ బడిలోనే చదివి సక్సెస్ఫుల్ మాన్ అయ్యాడు. అలాంటిది తన కూతురు ప్రత్యూష గవర్నమెంట్ బడిలో చదివితే ఎందుకు సక్సెస్ కాదు? గవర్నమెంట్ బడిలోనే క్వాలిటీ ఉన్న టీచర్స్ ఉంటారన్నది అతని ప్రగాఢ విశ్వాసం. అందుకే ఎవరెన్ని చెప్పినా వినకుండా తన కూతురు ప్రత్యూషను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తాడు.

అలా చేసినందుకు అతని తండ్రి అతనితో మాట్లాడటం మానేస్తాడు. భార్య ముభావంగా ఉంటుంది. ప్రత్యూషను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తేనే సఖ్యంగా ఉంటామని కరాఖండిగా చెప్పేస్తారు. అతను మాత్రం కూతుర్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తాడు. ఇదిలాఉంటే ఇంటర్ అయ్యాక అందరిలా ఇంజనీరింగ్ కి పంపించకుండా డిగ్రీలో చేర్పిస్తాడు సౌమిత్ర. దాంతో వాళ్ళ మధ్య దూరం మరింత పెరుగుతుంది.అసలు ప్రత్యూష మనసులో ఏముంది? సౌమిత్రతో కుటుంబ సభ్యులు కలిశారా? ప్రత్యూష భవిష్యత్ ఏ తీరాలకు చేరిందో తెలుసుకోవాలంటే ‘కృపాకర్ పోతుల’ రచించిన ఎదురీత అనే కథను చదవాలి. గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ కి ఏమాత్రం తీసిపోవని, అందులో చదివేవారి భవిష్యత్ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించిన కథ ఇది. విద్య అనేది కార్పోరేట్ చేతుల్లోకి వెళ్ళాక అది ఎలా వ్యాపారంగా మారిందో చూస్తూనే ఉన్నాం. ఇక ఆహారం కూడా కార్పోరేట్ చేతుల్లోకి వెళ్తే ఎలా ఉంటుందో ఊహాత్మకమైన ఆలోచనతో ‘సింహ ప్రసాద్’ రచించిన చక్కని కథే కిక్ ద కిచెన్. ఇప్పటికే చాలామంది సమయం లేదంటూ స్వయంపాకాన్ని పక్కనపెట్టి రెస్టారెంట్ల ఫుడ్ కి అలవాటు పడిపోయారు.

అది రాన్రాను మితిమీరిపోతే ఎలా ఉంటుందో తెలియజేస్తుందీ కథ. అంతేకాకుండా మన అలవాట్లను అవలోకనం చేసుకోమని హెచ్చరిస్తుంది.రైతుల కష్టాల మీద ఎన్ని కథలొచ్చినా ప్రతి కథా ఆకట్టుకోవడానికి కారణం ఒకప్పటి మన అస్తిత్వం అక్కడే ఉండటం. ‘దాట్ల దేవదానం రాజు’ రచించిన కాలం-పొలం కథ కాలానుగుణంగా పొలాలు ఎలా రూపాంతరం చెందుతున్నాయో, కారణాలేంటో విస్తృతపరుస్తూ సాగుతుంది.అన్ని కథల గురించి చర్చించడం భావ్యం కాదు. అందుకే ఈ సంకలనాన్ని చదవండి. పైన చెప్పుకున్న ఐదుగురు కథకులతో పాటుగా ‘మారుతి పౌరోహితం’ రచించిన కుశలంబే కదా ఆంజనేయ, ‘శరత్ చంద్ర’ రచించిన చివరకు మిగిలేది, ‘పెనుమాక రత్నాకర్’ రచించిన అన్నపూర్ణాలయం, ‘సిహెచ్ సీత’ రచించిన ఋగ్వేదం, ‘కిరణ్ జమ్మలమడక’ రచించిన మోహపు మరకలు, ‘కౌలూరి ప్రసాదరావు’ రచించిన ఊర్వారుక మివ బంధనా, ‘చంద్రశేఖర ఆజాద్’ రచించిన గోస అనే కథలు పాఠకుల మనసు దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి.

అన్ని కథలూ అలరిస్తాయి. ‘విజేతలుగా షీల్డుల మీదా, బ్యానర్ల మీదా ఎవరి పేర్లయినా ఉండొచ్చు. అసలైన అవార్డు విన్నర్ మాత్రం తెలుగు సాహిత్యం అవాలన్నదే మా ఆశ… ఆకాంక్ష…’ అన్న ఖమ్మం ఈస్తటిక్స్ వారి ఆశలు చాలావరకు నెరవేరాయనే చెప్పొచ్చు. ఇక మెరుగైన కథల ఎంపికలో వహించిన శ్రద్ధ, ప్రూఫ్ రీడింగ్ దగ్గరకొచ్చేసరికి సన్నగిల్లింది. అక్షర దోషాలు పంటికింద రాయిలా ఇబ్బంది పెడతాయి. కొన్ని కథలు రొటీన్ కథాంశాలే అయినా కథనం ఆకట్టుకుంటుంది. మానవత్వానికీ చోటు కల్పించిన ఈ కథాసంకలనం చదవదగ్గది.

కథా సంకలనం : ఈస్తటిక్స్ కథలు 2022
ప్రచురణ సంస్థ : ఖమ్మం ఈస్తటిక్స్ (ఓల్గా), పేజీలు : 182, వెల: రూ. 150/-, ప్రతులకు: 9849113469.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News