Saturday, December 21, 2024

ప్రశ్నకు మారు పేరు పెరియార్

- Advertisement -
- Advertisement -

సామాజిక న్యాయం జరగని స్వాతంత్య్రం నిష్ఫలమని తెల్లదొరల నుండి నల్లదొరలకు జరిగిన అధికార బదిలీ ఇనుప సంకెళ్ళు పోయి బంగారు సంకెళ్ళు రావడంలాంటిదని నినదించిన నిష్పక్షపాత విమర్శకుడు.పశువులను పూజించి మనుషులను ఛీకొట్టి, అంటుఅంటకట్టిన అష్టా వక్రబుద్ధుల శస్త్ర చికిత్సకుడు. తిరుగులేని తన హేతువాద(న) కరవాలంతో మూఢ నమ్మకాలను సమ్మతం కాని మత విశ్వాసాలను ఖండఖండాలుగా నరికి పారేసిన సత్యశోధక సేనాని. పెరియార్‌గా ప్రసిద్ధి చెందిన ఈరోడ్ వెంకటరామసామి నాయకర్. తమిళనాడులో సంపన్న బలిజనాయుడు కుటుంబంలో వెంకటప్ప నాయకర్, ముత్తమ్మాళ్ రెండవ సంతానం రామస్వామి నాయకర్. బాల్యం నుండి జన్మతః అబ్బిన హేతువాద దృక్పధంతో పరిసరాలను పరిశీలించి, ప్రశ్నించి, తనదైన విశిష్ట శీలనిర్మాణం చేసుకున్న రామసామి యవ్వనంలో తన తండ్రి మీద కోపంతో ఉత్తర భారత పుణ్యక్షేత్ర పరిశీలనకై పయనమయ్యారు. అక్కడి గుడిలో, బడిలో, వీధుల్లో సమాజంలో బ్రాహ్మణత్వ పడగ నీడలో బతుకు లీడుస్తూ నిరంతర వంచనకు గురవుతున్న బహుజనుల దీనావస్థకు చలించిపోయి అల్పసంఖ్యాక అగ్ర వర్ణాలు అధిక సంఖ్యాక అణగారిన వర్గాలను నియంత్రించడానికి తమకు సేవ చేయించుకోవడానికి దేవుని పేరిట,

పాపం పేరిట, పుణ్యం పేరిట, పునర్జన్మల పేరిట నిరంతరం శోషించడానికి ఏర్పాటు చేయబడ్డ క్రూర నియమావళి పేరే మత (మను) ధర్మాలని బలంగా విశ్వసించారు. ఆ తదుపరి తన జీవిత పర్యంతం హేతువాదాన్ని, నాస్తికత్వాన్ని తలకెత్తుకొని ప్రమాదాలకు ఎదురొడ్డి ఊరూర ప్రచారం చేసిన ధైర్యశాలి పెరియార్. మొట్టమొదటిగా చెప్పుకోవలసింది 1924 నుండి 1925 వరకు జరిగిన కేరళలోని (ట్రావెన్కోర్) వైకోం సత్యాగ్రహం. వైకోం మహాదేవ ఆలయంలోకి దారి తీసే నాలుగు దిశలోని నాలుగు ద్వారాలు నిమ్న కులస్థులకు నిరాకరించబడగా, మరొక దక్షిణాది సామాజిక విప్లవకారుడు నారాయణ గురు శిష్యుడైన మాధవన్ ప్రారంభించిన ఆలయ ప్రవేశ ఆందోళన రామస్వామి రాకతో ఊపందుకొని చివరకు ఆలయ మార్గల్లోకి మాత్రమే కాకుండా ఆలయంలోకి కూడా ప్రవేశం అనుమతించేంత వరకుసాగింది. అప్పటినుండి రామస్వామి వైకోం వీరర్ ప్రసిద్ధి చెందారు. కొంత కాలం గాంధీ జీ ప్రభావంతో కాంగ్రెస్‌తో పని చేసినప్పటికీ 1925లో జరిగిన కాంగ్రెస్ మహా సభలో కులాలవారీ నిష్పత్తి ఆధారిత ప్రాతినిధ్యాన్ని నిరాకరించిన కారణంగా కాంగ్రెస్ కేవలం బ్రాహ్మణత్వాన్ని నిలబెట్టడానికి పని చేస్తున్నదని కలత చెంది కాంగ్రెస్ కుల వివక్ష నిర్మూలనకు అంగీకరిస్తుందే కాని ఆచరించదని భావించి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.

అటు పిమ్మట ఆత్మ, పునర్జన్మలను నిరసించిన రామస్వామి ఆత్మ పదప్రయోగాన్ని కూడా వదిలేసి ఆత్మగౌరవం బదులుగా స్వయం గౌరవ (స్వయం మరియదై ఇయక్కం/సూయ మరియదై ఇయక్కం) ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా కుల, వర్ణ, వర్ణ, లింగ, వివక్షలేని సర్వజన సమానత్వం కోసం శ్రమించారు. పురోహితుడు పెళ్ళి తంతు అవసరం లేని స్వయం గౌరవ వివాహాలకు (దండల పెళ్లి) నాంది పలికారు. బ్రాహ్మణ పురోహితుల వైదిక వివాహ పద్ధతి, మంగళ సూత్రం, ఉంగరం మార్చుకోవడం లాంటి వేమి లేకుండా కేవలం నోటి మాట ద్వారా సన్నిహితుల సమక్షంలో జరిగే స్వయం గౌరవ వివాహాలకు దేశంలో తొలిసారిగా తమిళనాడు ప్రభుత్వం చట్టబద్ధం చేసి 1967లో మద్రాసు సవరణగా పిలవబడే హిందు వివాహ చట్టాన్ని రూపొందించింది. కుల సూచికలైన పేర్ల చివర ఉండే తోకలను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించి తన పేరు చివరన నాయకర్ అన్న పేరును త్యజించి కేవలం ఇవి రామస్వామి గానే చివరి వరకు కొనసాగారు. స్త్రీ సమానత్వాన్ని మనసా వాచా కోరుకున్న మహనీయుడు పెరియార్. దేవదాసి వ్యవస్థ, బాల్య వివాహాలు నిర్మూలించడానికి, వితంతు వివాహాలకు కృషి చేసి పెళ్ళి చేసుకోవలా వద్దా,

పిల్లల్ని కనాల వద్దా అనే నిర్ణయం పూర్తీగా స్త్రీ స్వంతమని తరతరాలుగా బలవంతంగా పిల్లల్ని కనడం ద్వారా స్త్రీ అస్వతంత్రురాలు అయిందని కుటుంబ బాధ్యతల్లో స్త్రీ పురుషులు ఇద్దరికీ సమాన బాధ్యత ఉండాలని ఎలుగెత్తాడు. అందుకనే కాబోలు 1930 ప్రాంతంలో జరిగిన అనేక హిందూ మత వ్యతిరేక ఉద్యమాల్లో స్త్రీల ప్రాతినిధ్యం ఎక్కువగా కనిపిస్తుంది. అందుకనే తమిళనాడులో ఏటా ఆయన జన్మదినాన్ని సామాజిక న్యాయదినోత్సవంగా జరుపుకుంటారు. తన జీవిత భాగస్వాములైన అయిన నాగమ్మాళ్, కన్నమ్మాళ్‌లను ముందు వరసలో నిలబెట్టి స్త్రీ ప్రాతినిధ్యాన్ని తన ఇంటి నుండే మొదలెట్టారు. ఉత్తర భారత దేశం బలవంతంగా ప్రవేశపెట్టిన హిందీ భాష అభ్యసనాన్ని వ్యతిరేకించి ద్రవిడ రాజకీయాలకు మార్గ నిర్దేశనం చేసిన రాజకీయవేత్త పెరియార్.నేటికీ ద్రవిడపదం లేకుండా తమిళ రాజకీయాలని ఊహించలేని స్వీయగౌరవ స్థితికి కారణం పెరియార్ అందుకనే ఆయనను ద్రవిడ ఉద్యమ పితామహుడు అని అంటారు. తమిళనాట రాజకీయ పార్టీలన్నింటికీ ఆయనే మూలబిందువు ఆయన నేతృత్వంలోని జస్టిస్ పార్టీ ఆ తరువాత ద్రవిడర్ కజగంగా అటు పిమ్మట ద్రావిడ మున్నేట్ర కజగంగా, అఖిలభారత ద్రావిడ మున్నేట్ర కజగంగా చీలిపోయినప్పటికీ మూల సిద్ధాంతాలు మాత్రం ఆయనవే. ఆత్మగౌరవ ప్రచారం కోసం కుడిఅరసు, రివోల్ట్ అనే పత్రికలను నడిపారు.

భగత్ సింగ్ రాసిన నేనెందుకు నాస్తికుణ్ణి పుస్తకాన్ని తమిళంలోకి అనువదింప చేశారు. ఆయన రాసిన పుస్తకాలన్నింటిలోకి అత్యంత వివాదాస్పదమైనది రామాయణ పతిరంగల్.ఈ పుస్తకాన్ని లల్లై సింగ్ యాదవ్ హిందీలో సచ్చిరామాయణ్‌గా అనువదించగా ఉత్తర భారత బ్రహ్మహ్మణత్వం గగ్గోలు పెట్టి పుస్తకాన్ని నిషేధించింది. అలహాబాద్ హైకోర్టులో పోరాటం చేసి న్యాయస్థానం సమ్మతితో తిరిగి పుస్తకాన్ని విడుదల చేశారు లల్లై సింగ్ యాదవ్. మన సామాజిక విప్లవకారులు చేసిన పోరాట లక్ష్యాలు విస్మయానికి గురిచేస్తాయి. మంచి నీళ్ళ కోసం చేసిన అంబేడ్కర్‌పోరాటం, వీధుల్లో నడవడానికి పెరియార్ చేసిన పోరా టం, బట్ట కట్టుకోవడానికి నంగేలి చేసిన పోరాటం, అక్షరం కోసం ఫూలే చేసిన పోరాటం, గౌరవం కోసం జరిగిన యుద్ధవేదిక భీమా కోరేగావ్. ఇంతటి నీచస్థితిలో బతికిందా అప్పటి సమాజం అని బాధ కలగకమానదు.మరణానికి వెరువక హేతువాద అగ్నిశిఖను చేతబూని జ్ఞాన వెలుగులను నింపిన సాహసి పెరియార్.తర్కం మాట్లాడినవాడి తల నరకండని చెప్పడం మానేసి వ్యవస్థీకృతం అయిన తప్పులను సరిదిద్దుకుంటేనే జనహితం, జాతిహితం.

 

విజయ్ రఘునందన్
9652377886

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News