హైదరాబాద్: హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి తనపై పోటీ చేయాలంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఎఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసద్దున్ ఒవైసీ ఇటీవల విసిరిన సవాల్‌ను కాంగ్రెస్ నాయకుడు మొహ్మద్ ఫిరోజ్ ఖాన్ విమర్శించారు. అసదుద్దీన్ ఒవైసీకి దమ్ముంటే కేరళలోని వయనాడ్ నియోజకవర్గంలో రాహుల్ గాంధీపై పోటీ చేయాలంటూ ఆయన సవాల్ చేశారు.
కాంగ్రెస్ పాలనలోనే హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి అనేక మార్పులు జరిగాయని, చేవెళ్ల, తాండూరు, వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలను తొలగించి నగరంలోని అసెంబ్లీ నియోజకవర్గాలను కలపడం వల్లే ఎంఐఎం ఇక్కడ తన స్థానాన్ని పదిలం చేసుకున్న విషయాన్ని మరువరాదని ఫిరోజ్ ఖాన్ చెప్పారు.
గతంలో ఎంఐఎం, కాంగ్రెస్ మద్య ఉన్న సంబంధాలను ఆయన గుర్తు చేస్తూ ఎంఐఎం మాజీ అధ్యక్షుడు అబ్దుల్ వాహిద్ ఒవైసీ కాంగ్రెస్ అభ్యర్థిగానే కన్సిలర్‌గా గెలుపొందారని అన్నారు. అసదుదీన్ తండ్రి, ఐఎంఐఎం దివంగత మాజీ అధ్యక్షుడు సలావుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్‌తో అనేక ఏళ్లు జతకట్టారని, ఈ కారణంగానే దారుస్సలాంను ఎంఐఎంకు అప్పగిండం జరిగిందని ఆయన చెప్పారు. గతంలో జిహెచ్‌ఎంసిలో మేయర్, డిప్యుటీ మేయర్ పదవులు ఎంఐఎంకు కాంగ్రెస్ మద్దతుతోనే లభించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.
తన తండ్రి, తాత పాటించిన సిద్ధాంతాలకు ఇటీవల తిలోదకాలు ఇచ్చిన అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్‌ను దూరం పెడుతూ బిజెపితో అంటకాగుతున్నారని ఆయన ఆరోపించారు. యుపిఎ 1, యుపిఎ 2లో భాగస్వామిగా ఉన్న ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉండేవని ఆయన చెప్పారు.