ఇంఫాల్ : మణిపూర్‌లో తాజాగా వెలుగు లోకి వచ్చిన విద్యార్థుల హత్య దృశ్యాలు సంచలనం రేకెత్తించాయి. రాజధాని నగరం ఇంఫాల్‌లో వందలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శన చేశారు. ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్ నివాసం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
వారిని చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ షెల్స్, స్మోక్ బాంబ్స్‌ను వాడాల్సి వచ్చింది. పోలీస్‌లు లాఠీ ఛార్జి చేయడంతో 30 మంది గాయపడ్డారని , వారిలో ఎక్కువ మంది బాలికలే ఉన్నారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించారు. ఉరిపొక్, ఓల్డ్ లాంబులేన్, సింగ్‌జమై, తదితర ప్రాంతాల్లోనూ విద్యార్థులు నిరసన ప్రదర్శనలు సాగించారు. విద్యార్థుల హత్యలకు కారకులైన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తోబాల్, కాక్‌చింగ్, బిష్నుపూర్ జిల్లాల్లో విద్యార్థులకు , భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణలు తలెత్తాయి.