భారత స్వాతంత్య్ర పోరాటంలో, ముల్కీ ఉద్యమంలో, నిరంకుశ నిజాం వ్యతిరేక పోరాటంలో, తెలంగాణ 1969 నాటి తొలి, మలి దశ ఉద్యమాల్లో కీలక పాత్రలు వహించిన, జీవితాంతం తెలంగాణ సమస్యలపై పోరాటం చేసిన తెలంగాణ పక్షపాతి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఏకకాలంలో నాలుగు భిన్నమైన, అంతర్గత సంబంధం కలిగి ఉన్న ప్రజా ఉద్యమాలతో ఆయన జీవితం ముడివడి ఉన్నదని చెప్పడం సముచితం.అవి వరుసగా నిజాం వ్యతిరేక పోరాటం, వెనుకబడిన కులాల ఉద్యమం, చేనేత సహకారోద్యమం, ప్రత్యేక తెలంగాణోద్యమం.
వాస్తవానికి తెలంగాణ ఉద్యమానికి ఆయన ఆది గురువు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర వితం ముడివడి వున్నదని చెప్పడం సముచితం. 1969లో తొలి దశ పోరాటంలోనే కీలక పాత్ర పోషించి, మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా త్యజించిన త్యాగశీలి.తెలంగాణ వాసుల కష్టాలు తీరాలంటే, ప్రత్యేక రాష్ట్ర సాధన తప్ప వేరే మార్గంలేదని భావించి, అందుకు వివిధ మార్గాలలో నిరసన స్వరాలు వినిపించారు.అలనాటి నిజాం సంస్థానంలో ఆదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న కొండా లక్ష్మణ్ జన్మించాడు.
చిన్నతనాన తల్లిని కోల్పోగా, ప్రాథమిక విద్య ఆసిఫాబాద్‌లో, హైదరాబాద్‌లో న్యాయశాస్త్ర విద్య పూర్తిచేసి, 1948లో న్యాయవాద వృత్తి చేపట్టారు. ఆనాడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించిన వారి పక్షాన కేసులను వాదిం చి, గెలిపించేవారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన, దేశంలోని అంతర్భాగమైన నిజాం ఏలుబడిలో ఉన్న తెలంగాణ, నిజాం నిత్య అకృత్యాలకు లోనైన దుస్థితిలో తెలంగాణ విమోచనోద్యమంలో క్రియా శీలక పాత్ర పోషించారు.
1947 డిసెంబర్ 4న నిజాం ప్రభువుపై బాంబులు విసిరిన నారాయణరావు పవార్ బృందంలో కొండా లక్ష్మణ్ కూడా నిందితుడే. కొంత కాలం అజ్ఞాతుడుగా వున్నారు. నిజాం నిరంకుశ పాలన పై నిప్పులవర్షం కురిపిస్తూ, ఆయన పాలన అంతానికి తిరుగుబాటు బావుటా ఎగురవేసి, తొలుదొలుత వ్యూహ రచన చేసింది బాపూజీయే. 1952లో తొలిసారి ఆసిఫాబాద్ శాసనసభ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించి, శాసనసభలో అడుగు పెట్టారు. 1957లో చిన్నకొండూరు నుండి గెలుపొంది శాసనసన డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1962లో స్పల్ప తేడాతో ఓటమి పాలైనా, ప్రత్యర్థి ఆక్రమాలతో గెలిచారని కేసు పెట్టి విజయం సాధించాడు. 1967లో భువనగిరి నుండి గెలిచాడు. 1957 -60 వరకు ఉమ్మడి రాష్ట్రం డిప్యూటీ స్పీకర్‌గా, అనంతరం దామోదరం సంజీవయ్య క్యాబినెట్‌లో ఎక్సైజ్, చేనేత, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రిగా, బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో కార్మిక, సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత సీఎం పదవి కోసం పివి నరసింహారావుతో పోటీపడ్డారు.
సిఎం పదవి దక్కనందుకు గవర్నర్‌గా నియమిస్తామని నాటి ప్రధాని ఇందిరా గాంధీ పిలిచిచెపితే, సున్నితంగా తిరస్కరించారు. కాసు బ్రహ్మనంద రెడ్డి ముఖ్యమంత్రిత్వ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఉంటూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ పక్షపాతిగా ఉద్యమ ఉధృతి కోసం రాజీనామా చేశాడు. 1969 మార్చి 27న తన రాజీనామాను ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డికి అందజేసిండు. దాన్ని ఆమోదిస్తున్నట్లు సిఎం ప్రకటించిండు.ఈ రాజీనామా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని చారిత్రక మలుపు తిప్పిందని చెప్పవచ్చు. 1972లో భువనగిరి నుండి విజయం కైవసం చేసుకున్నారు. 1973లో పాములపర్తి వేంకట నరసింహారావు తదనంతరం ముఖ్యమంత్రి అయ్యే అవకాశం గడప తొక్కిన, ఇందిరా గాంధీ ఒప్పుకున్నా నాటి హోం మంత్రి ఉమా శంకర్ దీక్షిత్ పట్టు వల్ల వెంగళరావుకు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ దొరికింది.
1958లో హుస్సేన్ సాగర్ తీరాన భూమి కొనుక్కుని జలదృశ్యం నిర్మించుకోగా, 2002లో చంద్రబాబు ప్రభుత్వం దాన్ని నేలమట్టం చేయించగా కోర్టు కెళ్ళి తనకు అనుకూల తీర్పుపొందాడు. చివరకు 97వ సంవత్సరంలో 2012 సెప్టెంబర్ 21న మరణించగా జలదృశ్యంలోనే అంత్యక్రియలు జరిగాయి. 1952లో ముల్కీ ఉద్యమంతో తెలంగాణ కోసం పోరాటం ప్రారంభించి, ప్రత్యేక రాష్ట్రం కోసం తొలి రాజీనామా చేసి, 97 ఏళ్ల పండు ముదుసలి వయసులో ఎముకలు కొరికే చలిని లెక్కచేయక ఢిల్లీలో దీక్ష చేసి, గాంధీ మార్గంలో శాంతియుత పోరాటాన్ని ఎంచుకుని, బాపూజీగా పిలువబడే కొండా లక్ష్మణ్ తన ఆస్తులను, జీవితాన్ని ధారబోసిన గొప్ప వ్యక్తిత్వం, నిబద్ధత కలిగిన రాజకీయ ఆదర్శనేతగా గుర్తింపు నొందారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చివరి శ్వాస ఉన్నంత వరకు చిత్తశుద్ధితో కృషి చేసి, మూడు తరాల వారధి ఉన్న తెలంగాణ రాష్ట్ర అలుపెరుగని, అవిశ్రాంత పోరాట యోధు డు బాపూజీ తెలంగాణ ప్రజానీకానికి ప్రాతఃస్మరణీయుడు.
రామ కిష్టయ్య సంగన భట్ల
9440595494