Friday, November 15, 2024

త్వరలోనే ప్రపంచ ఆర్థిక శక్తిగా భారతదేశం

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ : భారతదేశం త్వరలోనే ప్రపంచ ఆర్థిక శక్తిగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ప్రపంచ ఆర్థిక వృద్ధి కేంద్రంగా భారతదేశాన్ని మల్చడమే తమ ముందున్న ఆచరణీయ లక్షం అని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ బుధవారం ఇక్కడ వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ 20వ వార్షికోత్సవ సభలో పాల్గొన్నారు. ప్రపంచ చోదకశక్తిగా భారతదేశాన్ని తీర్చిదిద్దడం కోసం పాటుపడుతున్నామని , ఈ దిశలో సాగే సరైన కృషితో భారతదేశం ప్రపంచ స్థాయిలో ఇప్పుడున్న ప్రధాన ఆర్థిక శక్తివంతమైన దేశాల వరుసలోకి చేరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన వైబ్రెంట్ గుజరాత్ ఆలోచనను కొనియాడారు. ఈ సమ్మిట్ సభలో ప్రధాని తమ స్వరాష్ట్రంలో ప్రసంగించారు. 20 సంవత్సరాల క్రితం వైబ్రెంట్ గుజరాత్ పేరిట ఓ చిన్న విత్తనం వేశారని, తరువాత ఇది కాలక్రమంలో ఎదిగి ఇప్పుడు సుఫలాల మహా వృక్షంగా మారిందని ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. యుపిఎ హయాంలోని కేంద్ర ప్రభుత్వాలు ఎప్పుడూ గుజరాత్ పారిశ్రామిక అభివృద్థి గురించి పట్టించుకోలేదని, ఎన్నిసార్లు పారిశ్రామిక ప్రగతి దిశలో అనేక సూచనలు చేసినా నిర్లక్షం వహించాయని, ఈ దశలో వెలిసిన వైబ్రెంట్ గుజరాత్ ఇప్పుడు ముందుకు దూసుకువెళ్లుతోందని తెలిపారు.

వైబ్రెంట్ గుజరాత్ సదస్సుకు పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపార వాణిజ్య ప్రముఖులు తరలివచ్చారు. వైబ్రెంట్ గుజరాత్ ఏర్పాటు ద్వారా గుజరాత్‌ను భారతదేశ ఛోధకశక్తిగా మార్చేందుకు ప్రయత్నం జరిగింది. ఓ ఆలోచన వాస్తవిక రూపం సంతరించుకుంది. 2014లో తనకు దేశ సేవకు ప్రజలు అవకాశం కల్పించిన తరువాత , ఈ వైబ్రెంట్ గుజరాత్‌ను దృష్టిలో పెట్టుకునే భారతదేశాన్ని కూడా ప్రపంచ ఆర్థిక ఇంజిన్‌గా ఎందుకు మార్చకూడదనే ఆలోచనకు వచ్చానని తెలిపారు. ఇప్పుడు త్వరలోనే భారతదేశం ఈ లక్షసాధనతో ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సిఆర్ పాటిల్ ఇతరులు పాల్గొన్నారు. ఏ పనిని చేపట్టినా ప్రధానంగా మూడు అంశాలు ప్రస్తావనకు వస్తాయని స్వామి వివేకానంద చెప్పిన విషయాన్ని ప్రధాని మోడీ ఈ సదస్సులో గుర్తు చేశారు. వీటిని మూడు దశలుగా భావించవచ్చునని తెలిపారు. మనం ఏది తలపెట్టినా ముందు ఇది అయ్యేపనేనా? అనే అవహేళన తలెత్తుతుంది. తరువాత దీనిపై వ్యతిరేకత నెలకొంటుంది. అడ్డుకోవడం జరుగుతుంది. చిట్టచివరికి దీనికి సమ్మతి తలెత్తుతుందని చెప్పారు.

ప్రపంచం అంతా ఇప్పుడు వైబ్రెంట్ గుజరాత్ విజయాన్ని చూస్తోందన్నారు. రాష్ట్రాలలో పెట్టుబడుల దిశలో జరిగే ప్రచారానికి వైబ్రెంట్ గుజరాత్ ప్రాతిపదిక అయిందని, ఆ తరువాత పలు రాష్ట్రాలు ఈ దిశలో ముందుకు సాగాయని వివరించారు. అప్పటి కేంద్ర ప్రభుత్వాల నుంచి వైబ్రెంట్ గుజరాత్‌కు ఏనాడూ సరైన స్పందన రాలేదని విమర్శించారు. అప్పటి కేంద్ర మంత్రులు సమ్మిట్‌కు ఆహ్వానాలు అందినా రాకుండా , సహాయ నిరాకరణ ప్రదర్శించారని విమర్శించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ పలు విధాలుగా అనేక ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొందని, భూకంపాలు, కరువుకాటకాలు, సహకార బ్యాంకుల పతనం ,2002లో గోద్రా దుర్ఘటన తరువాత రాష్ట్రవ్యాప్త అనంతర విధ్వంసకాండ వంటి విపత్కర పరిణామాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. చివరకు గుజరాత్ దేశానికి భారం అయ్యేలా చూడాలని ప్రయత్నాలు జరిగాయని, వీటన్నింటి నడుమనే తాను అన్ని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని గుజరాత్ అంటే ఏమిటనేది దేశానికి చూపించడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు ఇక ఈ దేశం ఆర్థిక శక్తి ఏమిటనేది ప్రపంచానికి తెలిసివస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రధాని మోడీ రోబో టీ
ఈ ఫోటోను పదిలం చేసుకోవాలని పిలుపు
వైబ్రెంట్ గుజరాత్ 20వ వార్షికోత్సవం దశలో కార్యక్రమం ప్రాంగణంలో రోబోటిక్స్ గ్యాలరీ ఏర్పాటు అయింది. పలు గ్యాలరీలను సందర్శిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రధాని మోడీకి గ్యాలరీలోని ఓ రోబో ప్రత్యేకంగా టీ అందించింది. ఈ ఛాయ్‌ను స్వీకరించిన ప్రధాని మోడీ తనకు రోబో టీ అందించిన ఫోటోను ఎవరూ మిస్ కావద్దని కోరుతూ తరువాత ట్వీట్ వెలువరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News