Saturday, November 23, 2024

రేవంత్‌కు పక్క రాష్ట్రంపై ఉన్న శ్రద్ధ తెలంగాణపై లేదు: బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

- Advertisement -
- Advertisement -

తెలంగాణ పర్యటనకు రాబోతున్న ప్రధాని..
రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలి

మనతెలంగాణ/హైదరాబాద్: టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి పక్క రాష్ట్రం రాజకీయాలపై ఉన్న శ్రద్ధ తెలంగాణ రాజకీయాలపై లేకపోవడం శోచనీయమని బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన అంశమని అక్కడి రాజకీయాలపై ఇక్కడ ఆందోళనలు చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని మాత్రమే బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చెప్పారని, దీనిని రేవంత్ రెడ్డి పెద్దదిగా చేసి భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం శోచనీయమని ఆమె పేర్కొన్నారు. గురువారం మీడియా ఏజెన్సీతో మాట్లాడిన కవిత,  చంద్రబాబు అరెస్ట్ అంశం టిడిపి- వైసిపిలకు సంబంధించిన విషయమని, దానిపై తాను కామెంట్ చేయదల్చు కోలేదని అన్నారు. అక్టోబర్ 01వ తేదీన రాష్ట్రానికి రాబోతున్న ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధులను తీసుకురావాలని ఆమె కోరారు.

కాంగ్రెస్ ప్రకటించిన స్కీమ్‌లు అమలుకు సాధ్యం కానివి
విపక్ష ఇండియా కూటమి రేపు ఉంటుందన్న గ్యారెంటీ లేదని కవిత విమర్శించారు. ఆ కూటమిలో లక్షల్లో అభ్యర్థులు ఉన్నారని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమంట్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు సమస్యలతో పరిస్థితే వేరుగా ఉంటుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం పరిస్థితి మారుతుందని ఎన్నికలకు ముందు కూటములు పెద్దగా విజయవంతమైన దాఖలాలు లేవన్నారు. అందుకే బిఆర్‌ఎస్ వేచి చూసే ధోరణితో ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఒక అజెండా, తెలంగాణలో మరొక అజెండాతో ముందుకు వస్తోందని, కానీ బిఆర్‌ఎస్ మాత్రం ఒక్కటే అజెండాతో పని చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన స్కీమ్‌లు అమలుకు సాధ్యం కావన్నారు. బిజెపి గడిచిన పదేళ్లలో తెలంగాణకు చేసిందేమీ లేదని రాబోయే ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు ఓడించినట్లే,  ఇక్కడ కూడా ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలే వస్తాయని ఆమె పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News