టొరంటో : తమ దేశం భారత్‌తో సన్నిహిత సంబంధాలను కోరుకుంటుందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు. ఇండియాపై తమ వద్ద విశ్వసనీయమైన ఆరోపణలు ఉండనే ఉన్నాయని అయితే వీటితో సంబంధం లేకుండా బంధం విస్తరించుకోవాలను కుంటున్నట్లు చెప్పారు. ఖలీస్థానీ ఉగ్రవాదుల హత్యోదంతంతో ఇరుదేశాల నడుమ వివాదం చెలరేగుతున్న దశలో ప్రధాని ట్రూడో శుక్రవారం ఈ విధంగా స్పందించారు. మాంట్రియల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలోట్రూడో భారతదేశంపై ప్రధానంగా ప్రస్తావించినట్లు ది నేషనల్ పోస్టు పత్రిక తెలిపింది. భారతదేశం ఇప్పుడు ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా ఉందని, ఈ దేశంతో సన్నిహిత సంబంధాలను స్థాపించుకోవాలని తాము చిత్తశుద్ధితో యత్నిస్తున్నామని వివరించారు. ఇండియా అత్యంత కీలకమైన భౌగోళిక రాజకీయ పావుగా ఉందన్నారు. కెనడా ఇండియా నడుమ చిరకాల సంబంధాల గురించి అందరికీ తెలిసిందేనని, అయితే ఇటీవలి ఘటనలకు సంబంధించి ఒట్టావా దర్యాప్తు తంతుతో న్యూఢిల్లీ సహకార సమన్వయ ధోరణితో వ్యవహరించాల్సి ఉందన్నారు. దీని వల్లనే కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య సంబంధిత పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.
2020లో భారతదేశపు ప్రకటిత ఉగ్రవాది అయిన నిజ్జర్ ఈ ఏడాది జూన్ 18వ తేదీన కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రాంతంలో ఓ గురుద్వారా వెలుపల కాల్పుల్లో మృతి చెందారు. భారతీయ ఏజెంట్లు ఈ హత్యకు కారకులు అని కెనడా ప్రధాని పార్లమెంట్‌లో ఆరోపించడంతో భారతదేశం తీవ్రస్థాయిలో స్పందించింది. ఈ వివాదం పలు పరిణామాలతో మరింత రాజుకుంటోంది. భారతదేశం తరఫున నేరం జరిగిందని తెలిపే విశ్వసనీయ సమాచారం ఉందనే విషయాన్ని కెనడా ప్రధాని మరోసారి స్పష్టం చేశారు. అయితే ఈ విషయం వేరు , భారత్‌తో సంబంధాలు వేరు అని ఆయన స్పష్టం చేశారు. భారతదేశం ప్రగతిపథంలో దూసుకువెళ్లుతోంది. జియోపొలిటికల్ పవర్ అయింది. దీనిని కాదనలేం . గత ఏడాదే తాము ఇండో పసిఫిక్ వ్యూహం ప్రకటించామని , దీని మేరకు ఇండియాతో సన్నిహిత సంబంధాలనే ఆశిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. అయితే ఇదే సమయంలో చట్ట పాలన ఉండే దేశంగా కెనడాకు కొన్ని నిర్థిష్ట విధానాలు ఉంటాయి.
ఇటీవలి పరిణామాల విషయంలో నిజానిజాల నిగ్గు తేల్చుకునేందుకు భారతదేశ సహకారం అత్యవసరం అని కెనడా ప్రధాని స్పష్టం చేశారు. అమెరికా కూడా తమ వాదనను బలపర్చిందని, భారతదేశ విదేశాంగ మంత్రితో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ భేటీ అవుతున్నారు. ఈ దశలో భారతదేశంపై కెనడా ఆరోపణలను ప్రస్తావిస్తారని జస్టిన్ ట్రూడో విలేకరులకు తెలిపారు. ప్రజాస్వామిక దేశాలు చట్టబద్ధంగా వ్యవహరించాల్సి ఉంటుందని, ఈ విషయం అన్ని ప్రజాస్వామిక దేశాలకూ వర్తిస్తుందని స్పష్టం చేశారు.