న్యూఢిల్లీ: ‘ నరేగా’ గా అందరికీ పరిచితమైన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం( ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్) కింద రాష్ట్రాలకు చెల్లించాల్సిన నిధులను ఇవ్వకుండా ఉండడానికి ఈ పథకానికి సంబంధించిన సోషల్ ఆడిట్ నివేదికలను ఆమోదించడంలో కేంద్రం పథకం ప్రకారం విపరీతమైన జాప్యం చేయడం ద్వారా ఓ పథకం ప్రకారం ఆ పథకం అనాయాన మరణం చెందేలా చేస్తోందని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఆరోపించింది. చాలా రాష్ట్రాల్లో ఈ పథకం సోషల్ ఆడిటింగ్ యూనిట్లు అచేతన స్థితిలో ఉన్నాయంటూ మీడియాలో వచ్చిన కథనాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎక్స్‌లో షేర్ చేశారు. ‘మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టంలో గ్రామసభ జరిపే సోషల్ ఆడిటింగ్ అత్యంత ముఖ్యమైన భాగం. జవాబు దారీ తనాన్నిఅమలు చేయడానికి,
పారదర్శకతను పెంచడానికి అంటూ మౌలికంగా అవినీతిని అంతమొందించడానికి ఇవి ముఖ్యం. ప్రతిరాష్ట్రంలోను ఒక స్వతంత్ర సోషల్ ఆడిటింగ్ ఉండగా, కేంద్రం ఈ పథకానికి నేరుగా నిధులు అందజేస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ నిధుల మంజూరు ఊహించనంత ఆలస్యం అవుతోంది’ అని రమేశ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఫలితంగా సోషల్ ఆడిట్‌లో సకాలంలో జరగడం లేదు.అంతేకాదు ఈప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. దీన్ని సాకుగా చూపించి కేంద్రం రాష్ట్రాలకు నిధులు ఇవ్వడం లేదు. ఫలితంగా కూలీలకు కూలీల చెల్లింపులు జరగడం లేదు. ఇది ఈ పథకాన్ని చక్రవ్యూహంలో ఇరికించి తనకు తానుగా చనిపోయేలా చేయడం తప్ప మరోటి కాదు’ అని జైరాం రమేశ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.