న్యూఢిల్లీ : ఈ ఏడాది పండుగల సీజన్ మొదలైంది. దీంతో పాటు ఇ-కామర్స్ కంపెనీల ఆఫర్ల యుద్ధం ప్రారంభం కానుంది. ప్రతి సంవత్సరం ఇ-కామర్స్ కంపెనీలు పండుగ నెలల్లో భారీ విక్రయాలు జరుపుతాయి. ఈసారి ఈ-కామర్స్ కంపెనీలు పండుగ విక్రయాల్లో సరికొత్త రికార్డు సృష్టించవచ్చని అంచనా వేస్తున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఈ రెండు ఈకామర్స్ సంస్థలు అక్టోబర్ 8 నుంచి ఫెస్టివ్ సేల్స్‌తో పోటీపడనున్నాయి. అమెజాన్ తన ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ను ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఫ్లిప్‌కార్ట్ కూడా ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’ ప్రకటన చేసింది.
అమెజాన్ ప్రైమ్, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు సేల్‌ను ప్రారంభించడానికి 24 గంటల ముందే అక్టోబర్ 7 మధ్యరాత్రి నుంచి యాక్సెస్‌ను అందిస్తున్నాయి. అన్ని ఇ-కామర్స్ కంపెనీలు పండుగ సీజన్‌లో ప్రత్యేక విక్రయాల కోసం సన్నాహాలు చేశాయి. ఇ-కామర్స్ కంపెనీలు పండుగ డిమాండ్‌ను తీర్చడానికి దేశంలోని ప్రతి భాగానికి సకాలంలో డెలివరీని అందించడానికి అదనపు నియామకాలను కూడా చేపట్టాయి.
రూ.91,395 కోట్ల వరకు అమ్మకాలు
ఈ సంవత్సరం పండుగ సీజన్‌లో ఇ-కామర్స్ కంపెనీల అమ్మకాలలో కొత్త రికార్డును నమోదు చేయవచ్చు. మార్కెట్ రీసెర్చ్ కంపెనీ డాటమ్ ఇంటెలిజెన్స్, కన్సల్టింగ్ రీసెర్చ్ సంస్థ నివేదికలో తెలిపింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో వంటి ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీలు 2023 పండుగ నెలల్లో 11 బిలియన్ డాలర్ల్ల (రూ.91,395 కోట్లు) వరకు అమ్మకాలు చేయగలవని నివేదిక తెలిపింది. ఈ ఏడాది పండుగ సీజన్‌లో ఇ-కామర్స్ కంపెనీలు చేయబోయే స్థూల విక్రయాల విలువ 9.7 బిలియన్ల నుండి 11 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని నివేదికలు చూపిస్తున్నాయి. గతేడాది పండుగ సీజన్‌లో జరిగిన మొత్తం విక్రయాల కంటే ఈ సంఖ్య 15-16 శాతం ఎక్కువగా ఉంది. స్థూల సరుకుల విలువ అనేది విక్రయించిన వస్తువుల విలువ, దీనిలో ఎటువంటి ఖర్చులు ఉండవు.