Saturday, December 21, 2024

మత్స్య రంగం అభివృద్దికి కేంద్రం సహకరించాలి

- Advertisement -
- Advertisement -

చేపల వేట నిషేధ కాలానికి భృతిని రూ. 9000కి పెంచాలి
రిటైల్ ఫిష్ మార్కట్లకు వందశాతం నిధులివ్వండి
కేంద్రమంత్రి రూపాలతో ఫిష్‌ఫెడ్ చైర్మన్ భేటి

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగం అభివృద్ధికి ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి కేంద్ర ప్రభుత్వం కూడా తమ వంతు బాధ్యతగా సహకారం అందించి అవసరమైన సహాయం అందించాలని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ కేంద్ర మత్స్య శాఖ మంత్రి పురుషోత్తం రూపాలను కోరారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన ముగించుకొని శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరే ముందు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ ను ప్రత్యేకంగా కలుసుకొని చర్చించారు.

కేంద్ర ప్రభుత్వం (ఎన్ ఎఫ్ డి బి) జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ ద్వారా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు జరుపుతున్న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పి.ఎం. ఎం.ఎస్.వై) పథకంలో కనీసం 50శాతం నిధులను సాంప్రదాయ మత్స్యకారుల సంక్షేమానికి వినియోగించాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి ఇచ్చిన వినతి పత్రంలో ఫెడరేషన్ చైర్మన్ కోరారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో రాష్ట్రస్థాయి ఫిషరీస్ ఫెడరేషన్‌కు ప్రత్యేకంగా భాగస్వామ్యం కల్పించడంతోపాటు నేరుగా దరఖాస్తులను సిఫారసు చేసే వెసులుబాటును కలుగజేయాలని ఆయన కోరారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఎంపికయ్యే మత్స్య సహకార సంఘాలకు, వాటిలోని సభ్యులకు 60 శాతం సబ్సిడీని అందజేయాలని కూడా ఫెడరేషన్ చైర్మన్ కేంద్ర మంత్రిని కోరారు.

దేశవ్యాపితంగా చేపల వేటపై నిషేధం అమలుపరిచే 45 రోజుల కాలానికి ప్రతి మత్స్యకారునికి ప్రస్తుతం అందజేస్తున్న రూ.4500 జీవన భృతి మొత్తాన్ని 9వేల రూపాయలకు పెంచాలని కేంద్ర మంత్రికి విజ్ణప్తి చేశారు. ఉపరితల జల వనరుల విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్ర భాగాన నిలుస్తున్నదని, అందువల్ల ఉపరితల జనవనరుల చేపల పెంపకంలో పరిశోధనలు నిర్వహించే – సి ఐ ఎఫ్ ఆర్ ఐ – సెంటర్ ఫర్ ఇన్ ల్యాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థకు సంబంధించిన ప్రాంతీయ విభాగాన్ని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మత్స్యరంగం అభివృద్ధికి మరియు మత్స్యకారుల సంక్షేమానికి అమలు జరిపే పథకాలలో లబ్ధిదారులను ఎంపిక చేసే రాష్ట్ర స్థాయి కమిటీలలో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఫెడరేషన్ చైర్మన్ లను సభ్యులుగా నియమించాలని, అదేవిధంగా పాలక మండలిలో కూడా ఫెడరేషన్ చైర్మన్ లను డైరెక్టర్లుగా పరిగణించాలని కేంద్ర మంత్రిని కోరారు.

రాష్ట్రంలో చేపల ఆహార వినియోగాన్ని పెంచడం కోసం అన్ని ప్రాంతాలలో రిటైల్ ఫిష్ మార్కెట్ లను నిర్మించాలని, ఇందుకు అవసరమైన నిధులను 100శాతం సబ్సిడీపై అందజేయాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని రిజర్వాయర్లలో చేపలు పడుతున్న మత్స్యకారులు సాంప్రదాయంగా వినియోగిస్తున్న తెప్పలు మరియు పుట్టీల స్థానంలో సౌరశక్తి (సోలార్) వినియోగంతో నడిచే మోటారు బోట్లను ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించి సహకరించాలని విజ్ణప్తి చేశారు. దేశవ్యాప్తంగా ఉపరితల జల వనరులలో వృత్తిని నిర్వహిస్తున్న మత్స్యకారుల సంరక్షణ కోసం, మత్స్యరంగం సమగ్ర అభివృద్ధి కోసం ఒక ప్రత్యేకమైన నియంత్రణ చట్టాన్ని రూపొందించి అమలుపరచాలని ఫిష్‌ఫెడ్ చైర్మన్ పిట్టల రవీంధర్ కేంద్ర మత్సశాఖమంత్రి రూపాలకు విజ్ణప్తి చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News