చండీగఢ్ : తమ డిమాండ్ల సాధన కోసం పంజాబ్ రైతులు చేపట్టిన రైల్‌రోకో ఉద్యమం మూడోరోజు శనివారం కూడా కొనసాగింది. దీనివల్ల అనేక రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడమే కాకుండా చాలా రైళ్ల సర్వీస్‌లు రద్దయ్యాయి. మరికొన్ని రైళ్ల రూటు మార్చారు. వరదల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, పంట రుణాలను మాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఫరీద్‌కోట్, సమ్రాలా, మొగా, హోషియార్‌పూర్, గుర్‌దాస్‌పూర్, జలంధర్, తర్న్ తరణ్ , సంగ్రూర్, పాటియాలా, ఫిరోజ్‌పూర్, బతిండా, అమృత్‌సర్ ప్రాంతాల రైలు పట్టాలపై గురువారం నుంచి రైతులు బైఠాయిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళనలతో పంజాబ్, హర్యానాల్లో వందలాది మంది ప్రయాణికులు ఎక్కడికీ వెళ్లలేక స్తంభించిపోయారు. అంబాలా, ఫిరోజ్‌పూర్ రైల్వే డివిజన్లపై రైతుల ఆందోళన ప్రభావం తీవ్రంగా పడిందని రైల్వే అధికారులు తెలిపారు.
కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ, భర్తీకిసాన్ యూనియన్( క్రాంతికారి) ఏక్తా అజారీ భర్తీకిసాన్ యూనియన్, అజాద్ కిసాన్ కమిటీ( డోబా), బెహ్రంకీ కిసాన్ యూనియన్, షాహీద్ కిసాన్ యూనియన్, చొత్తురామ్ కిసాన్ యూనియన్ తదితర రైతు సంఘాలు ఈ ఆందోళనలో పాలుపంచుకున్నాయి. అయితే మూడు రోజుల పాటు తలపెట్టిన ఈ ఆందోళన శనివారంతో ముగిసిందని రైతులు తెలిపారు. వరద సాయంగా రూ. 50 వేల కోట్లు ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్రం అందించాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు మేరకు కనీస మద్దతు ధర ప్రకటించాలని కోరారు. వ్యవసాయ చట్టాల అమలును నిరసిస్తూ గతంలో చేపట్టిన ఉద్యమంలో చనిపోయిన రైతుల తాలూకు కుటుంబీకులకు రూ. 10లక్షలు నష్టపరిహారం అందించాలని, కుటుంబం లోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కూడా వీరు డిమాండ్ చేశారు.