సిమ్లా : హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల వైపరీత్యాలకు తీవ్రంగా నష్టపోయిన బాధితులకు విపత్తు ఉపశమన ప్రత్యేక ప్యాకేజి కింద రూ.3500 కోట్ల సాయాన్ని ముఖ్యమంత్రి సుఖ్‌వీందర్ సింగ్ శనివారం ప్రకటించారు. ఈఏడాది జులై 7 నుంచి సెప్టెంబర్ 10 వరకు భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. దీంతోపాటు మహాత్మాగాంధీ జాతీయగ్రామీణ ఉపాధి పథకం కింద ప్రహరీ గోడల నిర్మాణానికి మరో వెయ్యి కోట్లు ప్రకటించారు.
ప్రత్యేక ప్యాకేజీ కింద అందించే సాయం ఆదాయ పరిమితితో నిమిత్తం లేకుండా బాధితులందరికీ వర్తిస్తుందని తెలిపారు. ఇళ్లు కోల్పోయినా పంటలు దెబ్బతిన్నా మరే విధంగా నష్టం ఏర్పడినా ఈ సాయం అందిస్తామన్నారు. రాష్ట్రంలో ముంచుకొచ్చిన విపత్తు వల్ల 3500 ఇళ్లు పూర్తిగా 13,000 ఇళ్లు పాక్షికంగా ధ్వంసం అయ్యాయని, తాత్కాలికంగా పునరుద్ధరణ పనుల కోసం రాష్ట్రప్రభుత్వం స్వంతంగా ఇప్పటివరకు 1850 కోట్లు ఖర్చు చేసిందని మరో 1051 కోట్ల త్వరలో విడుదలవుతాయని చెప్పారు.