నిజామాబాద్: ప్రభుత్వం ఆర్యవైశ్యులకు అండగా ఉంటుందని, ఇప్పటికే ఎంతో సహాయసహకారాలు అందించామని, ఇకముందు కూడా ప్రభుత్వ సహకారం ఉంటుందని ఎంఎల్‌సి కవిత చెప్పారు. ఆదివారం నగరంలోని కిసాన్‌గంజ్‌లో పట్టణ ఆర్యవైశ్య సంఘం (బిగాల కృష్ణమూర్తి భవనం) నూతన భవనాన్ని ఆమె ప్రారంభించారు. అనంతంఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు ఎంతో చరిత్ర ఉందని, కాకినాడ నుంచి నిజామాబాద్ వరకు అమ్మవారిని పూజించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
ఆర్యవైశ్యులు అనాదిగా సత్రాలను నిర్వహించి లక్షలాది మందికి భోజన సదుపాయాలు కల్పిస్తారని, ప్రస్తుతం ఆ ఆనవాయితీని ఇప్పటికీ కొనసాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్ సర్కార్ మానవతా దృక్పదంతో పనిచేస్తోందని, అందులో భాగంగా పేదింటి ఆడ పిల్లలకు పెళ్లిల్లు చేసే బాధ్యతను సిఎం కెసిఆర్ భుజస్కంధాలపై వేసుకున్నారని అన్నారు. అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన నాటినుంచి కళ్యా ణలక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టి పేదింటి ఆడపిల్లలకు లక్ష 116రూపాయలను అందించడం జరుగుతోందన్నారు.
ఆర్యవైశ్యుల్లో సైతం పేదింటి ఆడపిల్లలు ఉంటే వారికి సైతం కళ్యాణ లక్ష్మీ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. ఆర్యవైశ్య సంఘ భవన నిర్మాణానికి కోటి 50 లక్షలు ఇవ్వడం జరిగిందని, అర్బన్ ఎంఎల్‌ఏ సైతం 75లక్షల రూపాయలను ఇవ్వడం జరిగిందన్నారు. ఇక అర్బన్ ఎంఎల్‌ఏ బిగాల గణేష్ గుప్తా నగర అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నందున, ఆయనను మళ్లీ గెలిపించి చట్టసభలోకి పంపించాలన్నారు. ఆర్యవైశ్యుల అభ్యున్నతికీ గణేషన్న ఇతోధికంగా కృషి చేస్తున్నారని అన్నారు. నగరంలో ఇటీవలే ఐటి హబ్‌ను తీసుకువచ్చి యువతకు ఉపాధిని కల్పించడం జరిగిందన్నారు. అభివృద్ధి కోసం పాటు పడే వ్యక్తులను రాబోయే ఎన్నికల్లో ఆదరించాలని, రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించాలని ఆమె కోరారు.
అర్బన్ ఎంఎల్‌ఏ బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ ఆర్యవైశ్య భవన నిర్మాణానికి ప్రభుత్వం కోటి 50లక్షలు ఇవ్వగా, తాను విడతల వారీగా మరో 75లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు. సంఘ సభ్యులు మరికొన్ని లక్షల రూపాయలు జమచేసి సంఘ భవన నిర్మాణం పూర్తి కావడానికి సహకరించారని అన్నారు. అంతకుముందు మంత్రి సత్యవతి రాథోడ్, ఎంఎల్‌సి కవిత, ఆర్యవైశ్య సంఘ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడు కొండ వీరశేఖర గుప్తా, సంఘ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.